అంతర్జాతీయం
బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు 2020
యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై డిసెంబర్ 20న మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు
ఎప్పుడు : 2020 డిసెంబర్ 31
ఎవరు : ఈయూ
ఎందుకు : ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు
జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం
జెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి.భారత్‌తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా తీర్మానం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎక్కడ : ఐరాసలో
ఎవరు : తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన భారత్ సహా 128 దేశాలు
ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిసెంబర్ 22న ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిం ది. ఆ దేశం నవంబర్ 29న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టడంతో భద్రతామండలి ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షల ఫలితంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, విదేశాల్లోని శ్రామికుల నుంచి పొందే ఆదాయాలపై పరిమితులు ఉంటాయి.
జాతీయం
కేంద్ర విభాగాల్లో 4.12 లక్షల ఖాళీలు
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2016, మార్చి 1 నాటికి దాదాపు 4.12 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం డిసెంబర్ 20న లోక్‌సభకు తెలిపింది. కేంద్ర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాల వార్షిక నివేదిక’ ప్రకారం 2016 మార్చి నాటికి మొత్తం 36.33 లక్షల ఉద్యోగాలకు గానూ 4.12 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి’ అని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. కేంద్ర సర్వీసుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రైల్వేశాఖ భద్రతా విభాగంలో 2017, ఏప్రిల్ నాటికి 1.28 లక్షల ఖాళీలు ఉన్నాయి.
వడోదరలో తొలి రైల్వే వర్సిటీ
దేశంలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో నేషనల్ రైల్ అండ్ ట్రాన్‌సపోర్ట్ యూనివర్సిటీ(ఎన్‌ఆర్‌టీయూ) పేరిట దీన్ని నెలకొల్పాలని డిసెంబర్ 20న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్లయింది. కంపెనీల చట్టం-2013 ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ నెలకొల్పే లాభాపేక్ష లేని కంపెనీ ప్రతిపాదిత యూనివర్సిటీని నిర్వహిస్తుంది. వర్సిటీకి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు చాన్‌సలర్, ఇతర ముఖ్యమైన బోధనా సిబ్బందిని ఆ కంపెనీయే నియమిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. విద్య, పాలన విధులు నిర్వర్తించేందుకు స్వతంత్ర బోర్డును కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి రైల్వే వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : వడోదర, గుజరాత్
గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక
అంతరాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సరికొత్త ప్రణాళిక రచించింది. అంతరాష్ట్ర జల వివాదాలు తలెత్తకుండా, ముంపు సమస్య లేకుండా.. తక్కువ ఖర్చుతో నాలుగు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం గోదావరి నదిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినెపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడ నుంచి 247 టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. నాగార్జునసాగర్ నుంచి సోమశిల రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి తమిళనాడులోని కావేరీ గ్రాండ్ ఆనకట్టలోకి నీటిని తరలిస్తారు.
మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే..
నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు
2జీ స్పెక్ట్రమ్ కేసులో అందరూ నిర్దోషులే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ డిసెంబర్ 21న ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి
ఓపీ సైనీ ఉద్ఘాటించారు. కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్ సృష్టించారు’’ అని అన్నారు.
2జీ స్పెక్ట్రమ్ లెసైన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్ లెసైన్సులు కేటాయించింది. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లెసైన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లెసైన్సులను రద్దు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరనీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు
యూపీలో కల్తీ సారా’కు మరణశిక్ష
కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిసెంబర్ 22న ఆమోదించింది. యూపీ ఎకై ్సజ్(సవరణ) చట్టం-2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్‌స తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఢిల్లీ మెట్రో మెజెంటా మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న ప్రారంభించారు. అనంతరం.. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ మెట్రో మెజెంటా మార్గం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
అభివృద్ధి ప్రాజెక్టులకు 56,070 హెక్టార్ల అటవీ భూములు
గడిచిన మూడేళ్లలో (2014-15 నుంచి 2016-17 వరకు) దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 26న వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి 8వ స్థానంలో నిలిచింది.
కాగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలసి ఈ మూడేళ్లలో 93,400 హెక్టార్లలోనే అడవులను పెంచాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆ మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2015 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 21.60 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.80 శాతమే. ఏపీలో 24.42 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 15.25 శాతమే.
ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో 2013 నుంచి 2015 మధ్య 168 చదరపు కి.మీ. మేర (16,800 హెక్టార్ల మేర)అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభివృద్ధి ప్రాజెక్టులకు అటవీ భూముల మళ్లింపులో రెండో స్థానంలో తెలంగాణ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ
మణిపూర్‌లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఇండియన్ సైన్‌స కాంగ్రెస్ సమావేశం మణిపూర్‌కు తరలిపోయింది. కోల్‌కతాలో డిసెంబర్ 27న సమావేశమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు సమావేశాల నిర్వహణకు పోటీ పడ్డాయి. చివరికి మణిపూర్ విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తాము ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. 105వ ఇంటర్నేషనల్ సైన్‌స కాంగ్రెస్ 2018 మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది.
ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం 2017 జనవరి మూడు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలతో సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఎప్పుడు : 2018, మార్చి 18 - 22
ఎక్కడ : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంఫాల్
వలసల్లో మొదటి స్థానంలో భారత్
ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎక్కువగా ఉంటున్న వారి జాబితాలో భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 18న విడుదల చేసిన అంతర్జాతీయ వలస నివేదిక ప్రకారం- 1.7 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అత్యధికంగా గల్ఫ్ ప్రాంతంలో 50 లక్షల మంది నివసిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న దేశాలు యూఏఈ(30 లక్షలు), అమెరికా(20 లక్షలు), సౌదీ అరేబియా(20 లక్షలు). మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 25.8 కోట్ల మంది సొంత దేశంలో కాకుండా.. ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. ఇది 2000 నాటితో పోల్చితే 49 శాతం ఎక్కువ.
కంపెనీల చట్టం సవరణకు రాజ్యసభ ఆమోదం
కంపెనీల చట్టం సవరణ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 19న ఆమోదించింది. ఇందులో దివాళా తీసే కంపెనీలపై కఠిన చర్యలు ప్రతిపాదించారు. కొత్తగా కార్పొరేట్ పాలనా ప్రమాణాల పటిష్టత, సరళతర వాణిజ్యానికి ఉపయోగపడేలా కొన్ని నిబంధనలు చేర్చారు. ఈ బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించింది.
బెంగళూరు నగరానికి అధికారిక చిహ్నం
అధికారిక చిహ్నం (లోగో) రూపొందించుకున్న భారత్‌లోని తొలి నగరంగా బెంగళూరు ఘనతను సొంతం చేసుకుంది. కన్నడ, ఆంగ్ల లిపి కలగలిసిన ఈ లోగోనూ ఎరుపు, తెలుపు రంగులో రూపొందించారు. దీనిని కర్ణాటక పర్యాటక, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే డిసెంబర్ 24న ఆవిష్కరించారు. దీంతో న్యూయార్క్, మెల్‌బోర్న్, సింగపూర్ లాంటి సిటీల సరసన బెంగళూరు నిలిచింది. ఒక పోటీ నిర్వహించి ఈ లోగోను నిపుణుల బృందం ఎంపిక చేసింది. నమ్మూరుకి చెందిన డిజైనర్ వినోద్ కుమార్ చిహ్నాన్ని రూపొందించారు. ఇంగ్లిష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా డిజైన్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అధికారిక చిహ్నం (లోగో) రూపొందించుకున్న భారత్‌లోని తొలి నగరం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : బెంగళూరు
ఎందుకు : పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు
ద్వైపాక్షికం
నల్లధనం సమాచార ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ సంతకాలు
నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌లు డిసెంబర్ 21న సంతకాలు చేశాయి. స్విట్జర్లాండ్ పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన విధానపర ప్రక్రియ ముగియడంతో జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి ఆండ్రియాస్ బామ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆటోమేటిక్ సమాచార మార్పిడి(AEIO) ఉమ్మడి డిక్లరేషన్‌పై రెండు దేశాల మధ్య 2017 నవంబర్ నెలలోనే అవగాహన కుదిరింది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలవుతుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండగా, తమకు అందిన సమాచారం గోప్యతను కాపాడతామని భారత్ స్విస్‌కు హామీ ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నల్లధనం సమాచార మార్పిడి ఒప్పందంపై సంతకాలు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : భారత్ - స్విట్జర్లాండ్
ఎందుకు : స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలుగా
భారత్, చైనా మధ్య ‘సరిహద్దు’ చర్చలు
భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు డిసెంబర్ 22న జరిగాయి. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాలేదు.
భారత్, చైనా మధ్య 2017 జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం 2017 ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి
పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటు చేసిన పాక్ అధికారులు.. ఇరువైపులా ఫోన్ ద్వారా (ఇంటర్‌కామ్) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా రికార్డు చేశారు. వీరితోపాటు వచ్చిన భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను జాధవ్‌తో మాట్లాడేందుకు అనుమతించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎక్కడ : ఇస్లామాబాద్, పాకిస్తాన్
ఐరాసకు అనుగుణంగానే ‘కశ్మీర్’ పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగానూ శాంతి, స్థిరత్వాలను సాధించాలంటే కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తీర్మానాన్ని అనుసరించి భారత్, పాక్‌లు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, అఫ్గానిస్తాన్, పాక్ దేశాల పార్లమెంటు స్పీకర్లు ఇస్లామాబాద్‌లో సమావేశమై ఈ ప్రకటనను వెలువరించారు. తొలుత కశ్మీర్ అంశంపై చర్చించేందుకు రష్యా, ఇరాన్, అఫ్గాన్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆయా దేశాలు తమకు రాజకీయంగా ప్రయోజనాలు చేకూర్చే అంశాలను చర్చల జాబితాలో చేర్చాయనీ, తమకూ కశ్మీర్ అంశమే ముఖ్యమని పాక్ పట్టుబట్టడంతో మిగతాదేశాలూ ఒప్పుకోక తప్పలేదు.
అలాగే... చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు కలసి తొలిసారిగా డిసెంబర్ 26న బీజింగ్‌లో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
ప్రాంతీయం
ఆర్‌కే నగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం
తమిళనాడులో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ విజయం సాధించారు. ఈ మేరకు డిసెంబర్ 24న జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన 40వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్‌కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.
డీజీపీ నియామక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26న ఆర్డినెన్‌స జారీ చేసింది. డీజీపీ పోస్టు కోసం రాష్ట్రానికి చెందిన ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను పంపించగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ యూపీఎస్సీ పలుమార్లు తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్డినెన్‌స తెచ్చేందుకు డిసెంబర్ 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్(రిఫారమ్స్, అడ్మినిస్ట్రేటివ్) ఆర్డినెన్‌స నంబర్ 4-2017ను జారీ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తు ఆర్డినెన్స్ జారీ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా
ఏఎన్‌యూలో ఐఈఏ శతాబ్ది ఉత్సవాలు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబు, బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్, ఐఈఏ కాన్ఫరెన్‌స అధ్యక్షుడు, సి.రంగరాజన్, భారత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోషియేషన్ అధ్యక్షుడు కౌశిక్ బసు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరట్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. 'ట్రాకింగ్ ది ఇండియన్ ఎకానమీ' పేరుతో డాక్టర్ సి. రంగరాజన్ రచించిన పుస్తక తొలి కాపీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : బైబిల్ మిషన్ ప్రాంగణం, ఏఎన్‌యూ
ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్‌స ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పించేందుకు
బెటర్ ఇండియా జాబితాలో సీపీ మహేశ్ భగవత్
బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్‌శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు.
అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు మహేశ్ భగవత్‌కు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్‌స రిపోర్ట్ హీరోస్ అవార్డు-2017ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెటర్ ఇండియా టాప్-10 ఐపీఎస్ ఆఫీసర్స్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మూడో స్థానంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ మాలకొండయ్య
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాలకొండయ్య 2018 జనవరి 1వ తేదీన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మాలకొండయ్య
మిషన్ అంత్యోదయలో ఏపీ ఫస్ట్
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిసెంబర్ 22న మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకులను ప్రకటించారు.
ఆర్థికం
టెక్స్‌టైల్స్ నైపుణ్యాభివృద్ధికి రూ.1300 కోట్లు
వ్యవస్థీకృత టెక్స్‌టైల్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన పెంచేందుకు రూ.1300 కోట్ల వ్యయంతో కొత్త పథకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’ పేరిట టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్ది సర్టిఫికెట్లు ఇస్తారు. వారిలో కనీసం 70 శాతం మందికి స్థిర వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘టెక్స్‌టైల్స్’లో నైపుణ్యాభివృద్ధికి ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు
దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు
దేశంలో వ్యక్తిగత ఆదాయం రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తమకు మొత్తం మీద రూ.కోటి, అంతకు మించి ఆదాయం ఉందంటూ 59,830 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. వీరు ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు. ఆదాయపన్ను శాఖ ఈ గణాంకాలను డిసెంబర్ 20న విడుదల చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికిపైగా ఆదాయం ఉందంటూ రిటర్నులు వేసిన వ్యక్తుల సంఖ్య 48,417 కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2.05 లక్షల కోట్లు. అంటే ఏడాది తిరిగేసరికి ఆదాయ లెక్కలు చూపించిన కోటీశ్వరుల సంఖ్య పెరగ్గా, వీరి ఉమ్మడి ఆదాయం మాత్రం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ
భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5-7 ట్రిలియన్ డాలర్ల (6.5-7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ డిసెంబర్ 21న పేర్కొన్నారు. 2035-40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏడవది. ఇక తలసరి ఆదాయం సైతం 2030 నాటికి 4,000 డాలర్లకు (ప్రసుతం 1,709 డాలర్లు)చేరే అవకాశం ఉందని స్కోచ్ సదస్సులో పాల్గొన్న వివేక్ దేబ్రాయ్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్
దేశీ ఈ-కామర్స్ మార్కెట్ - 50 బిలియన్ డాలర్లు
దేశీ ఈ-కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్-కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం-కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్‌స అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ-కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 50 బిలియన్ డాలర్ల స్థాయికి దేశీ ఈ - కామర్స్ మార్కెట్
ఎప్పుడు : 2018 నాటికి
ఎవరు : అసోచామ్-డెలాయిట్ నివేదిక
సైన్స్ అండ్ టెక్నాలజీ
నీటిని శోషించుకున్న మార్స్ ఉపరితలం
అంగారక గ్రహంపై ఒకప్పుడు నదిలా ప్రవహించిన నీటిని అంగారక గ్రహ ఉపరితలం స్పాంజ్ మాదిరిగా శోషించుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భూ ఉపరితలంపై ఉన్న రాళ్ల కంటే మార్స్ ఉపరితలంపై రాళ్లు 25 శాతం అధికంగా నీటిని శోషించుకుంటాయని గుర్తించారు. ఎప్పటినుంచో ఈ విధంగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నా.. తొలిసారి తాము మాత్రం ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపించామని వర్సిటీకి చెందిన పరిశోధకులు జాన్ వేడ్ వెల్లడించారు. ఇప్పటివరకు అయస్కాంత క్షేత్రం ఒక్కసారిగా పతనమవడంతో నీరు అంతరిక్షంలోకి మళ్లిందని పరిశోధకులు భావించేవారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీటిని స్పాంజ్ మాదిరిగా శోషించుకున్న అంగారక గ్రహం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు
ఫేస్‌బుక్ కొత్త ఖాతాకు ఆధార్
నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. అయితే.. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
తొలిసారి ఎగిరిన ఉభయచర విమానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం తొలిసారి డిసెంబర్ 24న గాల్లోకి ఎగిరింది. దీన్ని చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. కున్లాంగ్(ఎజీ600)గా పిలిచే ఈ విమానం దక్షిణ చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లోని జుహాయ్ విమానాశ్రయం నుంచి గాల్లోకి దూసుకెళ్లినట్లు చైనా వార్తా సంస్థ షిన్ హువా తెలిపింది.
క్రీడలు
తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి విదర్భ
రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు డిసెంబర్ 21న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌సలో ముగిసిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విదర్భ 5 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు పడగొట్టిన గుర్బానికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. డిసెంబర్ 29 నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో ఢిల్లీతో విదర్భ తలపడుతుంది.
బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూజీ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ మార్టిన్ డిసెంబర్ 21న వెల్లడించారు. నిజానికి 2022కు సంబంధించి 2015లోనే డర్బన్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో మరో వేదికను ఎంపిక చేయాల్సివచ్చింది. 2022 సంవత్సరం జూలై 27 నుంచి 7 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ బడ్జెట్ 14 వేల కోట్లు (1.845 బిలియన్ యూరోలు)గా నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో గ్రేట్ బ్రిటన్‌లో మరో నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా మారనుంది. మాంచెస్టర్ (2002 కామన్వెల్త్), లండన్ (2012 ఒలింపిక్స్), గ్లాస్గో (2014 కామన్వెల్త్) ఇప్పటికే మెగా ఈవెంట్స్‌కు వేదికలుగా నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2022 కామన్వెల్త్ గేమ్స్ వేదిక ఖరారు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎక్కడ : బర్మింగ్‌హామ్
కృష్ణపట్నంలో జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు డిసెంబర్ 21న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యాచెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ యూత్ నేషనల్ చాంపియన్ షిప్ పేరుతో తలపెట్టిన ఈ పోటీలను పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి ప్రారంభించారు. ఇక్కడే డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు తొమ్మిదోవ ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. వీటిల్లో భారతదేశంతోపాటు ఆసియా దేశాల్లోని 400 మంది సెయిలర్లు పాల్గొంటారు.
టీ20ల్లో రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ
అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డుని భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సమం చేశాడు. డిసెంబర్ 22న ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో రోహిత్.. 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. తద్వారా ఇటీవలే బంగ్లాదేశ్‌పై డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) నమోదు చేసిన 35 బంతుల్లోనే శతకం రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ(35 బంతుల్లో) రికార్డు సమం
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : రోహిత్ శర్మ
ఎక్కడ : ఇండోర్
విజేందర్‌కు ఆసియా పసిఫిక్ సూపర్ టైటిల్
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో వరుసగా పదో విజయం వచ్చి చేరింది. ఘనా బాక్సర్ ఎర్నెస్ట్ అముజుతో డిసెంబర్ 23న జైపూర్‌లో జరిగిన బౌట్‌లో విజేందర్ ఏకపక్ష విజయాన్ని సాధించాడు. మూడు నిమిషాల నిడివిగల 10 రౌండ్ల బౌట్‌లో విజేందర్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు న్యాయ నిర్ణేతలు విజేందర్‌కు 100 పాయింట్ల చొప్పున ఇవ్వగా... అముజుకు 90 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విజయంతో 32 ఏళ్ల విజేందర్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా పదో విజయం సాధించిన భారత బాక్సర్
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : విజేందర్ సింగ్
గల్యమ్ జరిల్‌గపోవ్ బాక్సింగ్ టోర్నీలో శ్యామ్ కుమార్‌కు స్వర్ణం
గల్యమ్ జరిల్‌గపోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మెరిశారు. మూడు స్వర్ణాలతోపాటు ఒక్కో రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్‌లోని కరాగండ పట్టణంలో డిసెంబర్ 24న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే వైజాగ్ బాక్సర్ శ్యామ్ ఫైనల్లో 3-0తో జన్‌సెతోవ్ (కిర్గిస్తాన్)పై... సెమీఫైనల్లో 4-1తో అయితోజనోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన నమన్ తన్వర్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు. నమన్ తన్వర్‌కు టోర్నమెంట్ బెస్ట్ బాక్సర్ పురస్కారం కూడా లభించింది. మనీశ్ కౌశిక్ (60 కేజీలు) రజతం... మన్‌దీప్ జాంగ్రా (75 కేజీలు) కాంస్య పతకం సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గల్యమ్ జరిల్‌గపోవ్ బాక్సింగ్ టోర్నమెంట్
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్‌కు స్వర్ణం
ఎక్కడ : కజకిస్తాన్
శ్రీలంకతో టీ20 సీరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సీరీస్‌ను భారత్ 3-0 తేడాతో గెలుచుకుంది. డిసెంబర్ 24న జరిగిన ఆఖరి టి20లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తాజా విజయంతో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్‌సలో రెండో స్థానానికి ఎగబాకింది.
టీ20లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడు వాషింగ్టన్
అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) రికార్డు సృష్టించాడు. ముంబైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా.. సుందర్ ఈ రికార్డు నమోదు చేశాడు.
భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్సు టాప్-5 క్రికెటర్లలో సుందర్ తర్వాత రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు; ఇంగ్లండ్‌పై ఫిబ్రవరి 1న, 2017).. ఇషాంత్ (19 ఏళ్ల 152 రోజులు; ఆస్ట్రేలియాపై ఫిబ్రవరి 1న, 2008)... రైనా (20 ఏళ్ల నాలుగు రోజులు; దక్షిణాఫ్రికాపై డిసెంబర్1న, 2006)... రవీంద్ర జడేజా (20 ఏళ్ల 66 రోజులు; శ్రీలంకపై ఫిబ్రవరి 10న, 2009) ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : వాషింగ్టన్ సుందర్
ఐసీసీటి20 ర్యాంకింగ్స్ లో రెండోస్థానంలో భారత్
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్‌సలో 121 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. 124 పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్ మూడు, న్యూజిలాండ్ నాలుగు, వెస్టిండీస్ అయిదో స్థానంలో నిలిచాయి. వ్యక్తిగత ర్యాంకింగ్‌సలో 824 పాయింట్లతో నంబర్ వన్‌గా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం కారణంగా లంకతో సిరీస్ ఆడలేదు. దీంతో 48 పాయింట్లు కోల్పోయి 776 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఫించ్ (784 పాయింట్లు), విండీస్ ఆటగాడు ఎవిన్ లూయీస్ (780) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య నాలుగు రోజుల టెస్ట్
సంప్రదాయ టెస్టుకు కాస్త భిన్నంగా నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, జింబాబ్వేల మధ్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ వేదికగా డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ డే అండ్ నైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్‌స, 120 పరుగులతో జింబాబ్వే ఓడిపోయింది.
1972-73 తర్వాత ఐదు రోజులు కాకుండా ఒక టెస్టు నాలుగు రోజుల్లో జరగనుండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఆరు రోజులు, కొన్ని సార్లయితే మూడు నుంచి పది రోజుల టెస్టులు కూడా జరిగాయి. 1938-39లో చివరిసారిగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య డర్బన్‌లో జరిగిన పది రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 1972 సీజన్ తర్వాత టెస్టు ప్రామాణికంగా ఐదు రోజుల ఆటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంప్రదాయ టెస్ట్‌కు భిన్నంగా నాలుగు రోజుల డే అండ్ నైట్ టెస్ట్
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : దక్షిణాఫ్రికా - జింబాబ్వే
ఎక్కడ : పోర్ట్ ఎలిజబెత్, దక్షిణాఫ్రికా
ఎందుకు : టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా రికార్డు
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా సయ్యద్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో అనీసా (హరియాణా) 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. శీతల్ శివాజీ థోరాట్, రాహీ సర్ణోబత్‌లు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 33 పాయింట్లతో అనీసా జాతీయ రికార్డు
ఎక్కడ : తిరువనంతపురం, కేరళ
వార్తల్లో వ్యక్తులు
ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌లలో ఇద్దరు తెలంగాణ కలెక్టర్లు
బెటర్ ఇండియా వెబ్‌సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొందించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది.
భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు.
ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెటర్ ఇండియా ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌ల జాబితా
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : రొనాల్డ్ రాస్, భారతి హొలికెరికి జాబితాలో చోటు
యూజీసీ చైర్మన్‌గా ధీరేంద్ర పాల్ సింగ్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్‌ను నియమిస్తూ డిసెంబర్ 22న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) డెరైక్టర్‌గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్‌గా 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూజీసీకి కొత్త చైర్మన్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్
ఆమ్నెస్టీ జనరల్ సెక్రటరీగా కుమీ నాయుడు
అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్ షెట్టి 2018 ఆగస్టులో రిటైరయిన తరువాత నాయుడు బాధ్యతలు స్వీకరిస్తారు. 52 ఏళ్ల నాయుడు 2009- 2015 మధ్య కాలంలో గ్రీన్‌పీస్ ఇంటర్నేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించినా మిగిలిన భారత సంతతి ప్రజల మాదిరిగానే నాయుడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పలుమార్లు అరెస్టయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : కుమీ నాయుడు
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా
ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ 100 మంది సెలబ్రిటీ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ మరోసారి తొలి స్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితాను డిసెంబర్ 22న విడుదల చేసింది. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి పేర్లతో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. ఇందులో 232.83 కోట్ల ఆదాయంతో సల్మాన్‌ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. 170.50 కోట్ల ఆదాయంతో షారూఖ్‌ఖాన్ రెండో స్థానంలో, 100.72 కోట్ల ఆదాయంతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు.
2017 జాబితా
సల్మాన్ ఖాన్ - రూ.232.83 కోట్లు
షారుఖ్ ఖాన్ - రూ.170 కోట్లు
విరాట్ కొహ్లీ - రూ.100.72 కోట్లు
అక్షయ్ కుమార్ - రూ.98.25 కోట్లు
సచిన్ టెండూల్కర్ - రూ.82.50 కోట్లు
అమీర్ ఖాన్ - రూ.68.75 కోట్లు
ప్రియాంక చోప్రా - రూ.68 కోట్లు
ఎం.ఎస్.ధోని - రూ.63.77 కోట్లు
హృతిక్ రోషన్ - రూ.63.12 కోట్లు
రవీణ్‌వీర్ సింగ్ - 62.63 కోట్లు
తెలుగు సెలబ్రిటీలు
పీవీ సింధూ - 13వ స్థానం - రూ.57.25 కోట్లు
రాజమౌళి - 15వ స్థానం - రూ.55 కోట్లు
ప్రభాస్ - 22వ స్థానం - రూ.36.25 కోట్లు
సైనా నెహ్వాల్ - 29వ స్థానం - 31 కోట్లు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : తొలి స్థానంలో సల్మాన్ ఖాన్
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారు
దాణా కేసులో లాలూని దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టు
21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. డిసెంబర్ 23న మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొంది. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991-94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు
నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్
అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్‌కు తపాలా శాఖ అరుదైన గౌరవం కల్పించింది. మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వేణుమాధవ్ 86వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనపై తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. డిసెంబర్ 26న హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో నిర్వహించిన కార్యక్రమంలో సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ కవర్‌ను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : తపాలా శాఖ
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ
వరుసగా రెండోసారి విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మేరకు డిసెంబర్ 26న నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్ పటేల్ సహా 9 మంది కేబినెట్ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు.
ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎందుకు : గుజరాత్‌లో వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజీపీ
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) డిసెంబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్‌జ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జైరామ్ ఠాకూర్
అవార్డులు
దేవిప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం
ప్రముఖ కవి, రచయిత దేవిప్రియను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2017 వరించింది. ఆయన పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో పురస్కారానికి ఎంపికై ంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా అందించే వార్షిక అవార్డులను డిసెంబర్ 21 ఢిల్లీలో ప్రకటించింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను పురస్కారాలకు ఎంపిక చేసింది.
అలాగే.. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద రచనగా తెలుగు నుంచి వెన్న వల్లభరావు అనువదించిన ‘విరామం ఎరుగని పయనం’రచనకు అవార్డు లభించింది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అజీత్ కౌర్ జీవితకథ ‘ఖానాబదోష్’ను వల్లభరావు తెలుగులో ‘విరామం ఎరుగని పయనం’గా అనువదించారు. అవార్డులను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అకాడమీ కేంద్రంలో జరిగే ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఉత్తమ కవితా సంపుటికి రూ. లక్ష, ఉత్తమ అనువాద రచనకు రూ. 50 వేల చొప్పున నగదు బహుమతిని అందించనున్నారు.
రన్నింగ్ కామెంటరీ కవిగా సుపరిచితులు..
దైనందిన రాజకీయ, సాంఘిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ‘రన్నింగ్ కామెంటరీ’ కవిగా సుపరిచుతులైన దేవిప్రియ 1951 ఆగస్టు 15న గుంటూరు జిల్లాలో జన్మించారు. సినీరంగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవిప్రియ... జర్నలిజంలో స్థిరపడి వివిధ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం ఏడు కవితా సంపుటాలను రచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌పై ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం ‘మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్’ను నిర్మించి దర్శకత్వం వహించారు. దాసి, రంగుల కల వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించి జాతీయ బహుమతులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేవిప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం - 2017
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎందుకు : పద్యకావ్యం ‘గాలిరంగు’ తెలుగు నుంచి ఉత్తమ కవితా సంపుటి విభాగంలో
Comments
Post a Comment