అంతర్జాతీయం
గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదిక
భారత్‌లో అనారోగ్య, పర్యావరణ సమస్యలు తీవ్రంగా పెరగడానికి అత్యల్ప అక్షరాస్యతే కారణమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాదిమందికి అక్షరజ్ఞానం లేకపోవడం వల్లే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన లేదని పేర్కొంది. ఈ మేరకు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదికను డిసెంబర్ 14న విడుదల చేసింది.
2016 లో ప్రపంచవ్యాప్తంగా 44.7 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కాగా, దానిలో 20 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేశారు. ఈ- వేస్ట్ ఉత్పత్తిలో 7.2 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ చైనా మొదటి స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదిక
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : భారత్‌లో
ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్
2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్ అనే పదాన్ని గుర్తిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ డిసెంబర్ 15న ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ప్రకారం యూత్‌క్వేక్ అంటే యువతరం ప్రభావం వల్ల లేదా వారి చర్యల కారణంగా వచ్చే సాంస్కృతిక, రాజకీయ, సామాజిక మార్పు’ అని అర్థం. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు
ఎందుకు : యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యానికి గుర్తింపుగా
ట్వీటర్ న్యూస్ నెట్‌వర్క్ టిక్‌టాక్’
వార్తల కోసం మొబైల్ ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడే వారిని దృష్టిలో ఉంచుకుని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్ తాజాగా వార్తల సర్వీసులను ప్రారంభించింది. బ్లూమ్‌బర్గ్ మీడియాతో కలిసి టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా బ్లూమ్‌బర్గ్ జర్నలిస్టులు రిపోర్ట్ చేసే వార్తలు, లైవ్ వీడియోలు ఉంటాయి. వీక్షకులు పంపే బ్రేకింగ్ న్యూస్ కంటెంట్‌ను కూడా బ్లూమ్‌బర్గ్ ఎడిటర్లు ధృవీకరించుకుని, ఎడిట్ చేసి అందిస్తారు. ఈ టిక్‌టాక్ న్యూస్ సర్వీసు కోసం బ్లూమ్‌బర్గ్ సంస్థ... ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, సోషల్ మీడియా అనలిస్టులు, ప్రోడక్ట్ డెవలపర్స్, ఇంజినీర్లు, డిజైనర్లు మొదలైన వారితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : ట్వీటర్, బ్లూమ్ బర్గ్
జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి.
50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవద్దని కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేం తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎక్కడ : ఐరాస భద్రతా మండలి
ఎందుకు : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈజిప్టు తీర్మానాన్ని రూపొందించింది
జాతీయం
మార్చి 1 నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని విచారించేందుకు దేశవ్యాప్తంగా 2018 మార్చి నాటికి 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టుల్ని సంప్రదించి రాష్ట్రాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం డిసెంబర్ 14న ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 1, 2018
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : అన్ని రాష్ట్రాల్లో
ఎందుకు : ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న 13,500 కేసులు విచారించేందుకు
ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ట్రిపుల్ తలాక్ (తలాక్- ఇ-బిద్దత్) పై రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం డిసెంబర్ 15న ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం నేరం. అందుకు గాను భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేట్లు బిల్లును రూపొందించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం.
జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయిపుంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ముందస్తు సమాచారం లేకుండా చెప్పే ట్రిపుల్ తలాక్‌ను నిరోధించడానికి
ఆగ్నేయాసియా గేట్‌వేగా మిజోరాం : మోదీ
మిజోరం రాష్ట్రంలోని కొలాసిబ్ ప్రాంతంలో నిర్మించిన 60 మెగావాట్ల తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 16న ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోం రైఫిల్స్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగించిన మోదీ.. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్‌సపోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విసృ్తత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్‌స వంటి 10 ఆసియన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని చెప్పారు.
గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తంగా 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 99 స్థానాలు గెలుచుకొని వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్‌కు 79 స్థానాలు, ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకున్నారు. గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మోజారిటీ 92 స్థానాలు.
68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 44 స్థానాల్లో గెలిచి ఐదేళ్ల అనంతరం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 35 స్థానాలు.
ఈ రెండు రాష్ట్రాల్లో విజయంతో దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది.
గుజరాత్; మొత్తం స్థానాలు- 182
బీజేపీ
99
కాంగ్రెస్
77
భారతీయ ట్రైబల్ పారీ
2
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
1
స్వతంత్రులు
3
ఓట్ల శాతం
బీజేపీ
49.1 శాతం
కాంగ్రెస్
41.4 శాతం
హిమాచల్‌ప్రదేశ్; మొత్తం స్థానాలు – 68
బీజేపీ
44
కాంగ్రెస్
21
సీపీఐ(ఎం)
1
స్వంతంత్రులు
2
ఓట్ల శాతం
బీజేపీ
48.8 శాతం
కాంగ్రెస్
41.7 శాతం
దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి
దివ్యాంగులకు ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే అన్ని ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో 5 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం -2016, సెక్షన్ 32 పరిధిలోకి వచ్చే అన్ని విద్యాసంస్థలు ఏటా ఈ నిబంధనను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.
ప్రాంతీయం
ఆదిభట్లలో మైమానిక ఇంజిన్ పరికరాల తయారీ
హైదరాబాద్‌లోని ఆదిభట్లలో ఉన్న ఏరోస్పేస్ సెజ్‌లో వైమానిక ఇంజిన్లు తయారు కానున్నాయి. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ ఏరో సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్), అంతర్జాతీయ ఇంజినీరింగ్ సంస్థ జీఈ గ్రూప్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఎఫ్‌ఎం లీప్ వైమానిక ఇంజిన్‌కు అవసరమయ్యే వివిధ పరికరాలను తయారు చేస్తారు. దీనికి సంబంధించి డిసెంబర్ 14న జీఈ- టాటా సన్‌స ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు 50 కోట్ల డాలర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైమానిక ఇంజిన్ పరికరాల తయారీ ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : టాటా అడ్వాన్‌సడ్ ఏరో సిస్టమ్స్ లిమిటెడ్ మరియు జీఈ గ్రూప్
ఎక్కడ : ఆదిభట్ల ఏరోసెజ్, హైదరాబాద్
ఎందుకు : వైమానిక ఇంజిన్ పరికరాల తయారీకి
ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఇర్ అధ్యక్షతన జరిగే ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.
డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పేట్లు సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘తెలుగు వెలుగును ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణా ఖ్యాతిని దశదిశలా చాటుదాం’’ అనేది ఈ మహాసభల నినాదం. ఈ సభలకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాదాపు 6 వేల మంది తెలుగువారిని ఆహ్వానించారు. 1975లో తొలి తెలుగు ప్రపంచ మహాసభలు జరగగా 2012లో చివరి మహాసభలు జరిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
డీజీపీ నియామకంను రాష్ట్ర పరిధిలోకి తెస్తూ ఏపీ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీజీపీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా పోలీస్ చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్‌స కూడా తీసుకురావాలని తీర్మానించింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్‌స తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్‌స ద్వారా రాష్ట్రానికి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రం పరిధిలోకి డీజీపీ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఏపీ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఏపీ అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్
రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. డిసెంబర్ 16న వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
125 ఎకరాల విస్తీర్ణంలో కొలను
250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్ ఖరారు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : అమరావతి
తెలంగాణలో జిల్లాల వెనుకబాట నివేదిక
వెనుకబాటుతనంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాలే ముందు వరసలో ఉన్నాయి. 31 జిల్లాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలు అత్యంత వెనుకబాటుతనంతో టాప్‌లో ఉన్నాయి. పాత జిల్లాలు ఉన్నప్పుడు వెనుకబాటుతనం, పేదరికంలో ముందు వరుసలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా తాజాగా 14వ స్థానంలో నిలిచింది. ఇటీవల నీతి ఆయోగ్‌కు పంపించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
11 అంశాల ప్రాతిపదికగా జిల్లాల వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. భూమి లేని నిరుపేద కూలీలు, గర్భిణుల సంరక్షణ, ఆసుపత్రుల్లో ప్రసవాలు, పిల్లల ఎదుగుదల, బరువు తక్కువగా ఉండటం, ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్లు, పిల్లలు-ఉపాధ్యాయుల నిష్పత్తి, కరెంటు, రోడ్డు, తాగునీరు లేని గ్రామాలు, మరుగుదొడ్లు లేని ఇళ్లను ప్రామాణికంగా స్వీకరించింది. వీటన్నింటా ఆందోళనకర పరిస్థితులున్న జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. ఈ అంచనా విధానాన్ని కేంద్రం కంపోజిట్ ఇండెక్స్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితులను మొత్తం 100 పాయింట్లకు ఎక్కువ పాయింట్లు సాధించిన జిల్లాల వరుసలో వెనుకబాటుతనాన్ని అంచనా వేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో మొదటి 10 స్థానాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్ రూరల్, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్, ఆదిలాబాద్‌లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు అభివృద్ధిలో ముందంజలో నిలిచాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ డెరైక్టరేట్ అనుమతులురాగా.. కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 5న ఢిల్లీలో సమావేశమైన జల సంబంధమైన ప్రాజెక్టుల ‘ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదని తేల్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు తుది దశ పర్యావరణ అనుమతులు
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి
హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం డిసెంబర్ 19న జరిగింది. ఎల్‌బీ స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణం పోతన వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాష ప్రాధాన్యాన్ని, తెలుగు సాహితీవేత్తల వైభవాన్ని, తెలంగాణ ప్రముఖులను రాష్ట్రపతి తన ప్రసంగం ఆద్యంతం స్మరించుకున్నారు.
ప్రతి డిసెంబర్‌లో తెలుగు మహాసభలు
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఇకపై రాష్ట్రంలో ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయని వివరించారు. ఇకపై ఏ మీడియమైనా, ఏ సిలబస్ అయినా ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌దాకా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ముఖ్య అతిథి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
తెలంగాణలో నాలుగు లక్షల మందికి బాల్య వివాహాలు
దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది.
పాలమూరు టాప్.. కరీంనగర్ లాస్ట్
బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతం), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం), నిజామాబాద్(16.3 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో 4 లక్షల మందికి బాల్య వివాహాలు
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఎంవీ ఫౌండేషన్
ఆర్థికం
ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 జిల్లాల గుర్తింపు
దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించింది. వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతో పాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్ వసతి వంటి కీలకమైన మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని ఈ జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాదం సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ఈ జాబితాలో తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలు స్థానం పొందాయి.
రాష్ట్రాల వారీగా గుర్తించిన జిల్లాల జాబితా కోసం క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన 115 వెనుకబడిన జిల్లాల గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు
2018 జూన్ నుంచి ఈ-వే బిల్లింగ్
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా కోసం 2018 జూన్ 1 నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ-వే బిల్లు వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకుంది. ఐటీ నెట్‌వర్క్ సంసిద్ధతపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా 2018 జూన్ 1 నుంచి ఈ-వే బిల్లింగ్ వ్యవస్థను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్‌స ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అడ్డంకులు మొదలైన అంశాలపై చర్చించిన అనంతరం జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 16 నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకు రవాణాకు ఈ-వే బిల్లులను వినియోగించడం ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ - వే బిల్లింగ్
ఎప్పుడు : 2018 జూన్ 1 నుంచి
ఎవరు : జీఎస్టీ మండలి
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు
పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ ట్యాక్స్ తగ్గింపు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశ జీడీపీ వృద్ధి, ఉపాధి కల్పనలో ఆటోమొబైల్ రంగం కీలకపాత్ర పోషించడం కొనసాగేలా తోడ్పాటు అందించనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంలో ఆటోమొబైల్స్, బ్యాటరీల తయారీ హబ్‌గా మారాలని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
4.88 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా నమోదైంది. ఇది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం కంటే అధికం. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్రం డిసెంబర్ 12న విడుదల చేసింది.
3.93 శాతంగా టోకు ధరల ద్రవ్యోల్బణం
నవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది. కాగా, గత ఎనిమిది నెలల కాలంలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఐఎన్‌ఎస్ కల్వరి జలప్రవేశం
స్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ కల్వరి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 14న ముంబైలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గామిని ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్‌ఎస్ డిజైన్ చేయగా రక్షణ శాఖకు చెందిన మజగాన్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్-ముంబై) నిర్మించింది. హిందూ మహాసముద్రంలోని భయంకరమైన ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. స్కార్పిన్ సిరీస్‌లో మొత్తం ఆరు సబ్‌మెరైన్లు నిర్మిస్తుండగా అందులో కల్వరి మొదటిది.
కల్వరి ప్రత్యేకతలు
జలాంతర్గామి జాడ చిక్కకుండా ధ్వనిని అదుపు చేసే అత్యాధునిక సాంకేతికత.
యాంటీ షిప్ క్షిపణులతో నీళ్లలోను, సముద్ర ఉపరితలంపైనా దాడిచేయవచ్చు.
రేడియేషన్ స్థాయిలు అతి తక్కువగా ఉంటాయి.
పొడవు: 67.5 మీ (221 అడుగులు)
వేగం: నీటిలో ఉన్నప్పుడు గంటకు 37 కి.మీ.
సముద్ర ఉపరితలంపై గంటకు 22 కి.మీ.
పరిధి: ఉపరితలంపై 12,000 కి.మీ. నీటిలో ఉన్నప్పుడు 1,020 కి.మీ.
18 టార్పెడోలను మోసుకెళ్లగలదు. 350 మీటర్ల లోతుకు వెళ్లగలదు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎన్‌ఎస్ కల్వరి జలప్రవేశం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : మజగావ్ డాక్ లిమిటెడ్, ముంబై
ఎందుకు : స్కార్పిన్ సబ్‌మెరైన్ సిరీస్‌లో భాగంగా
కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం గుర్తింపు
నాసా కృత్రిమ మేధ సాయంతో కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం కెప్లర్ 90ఐ ను డిసెంబర్ 14న గుర్తించింది. కెప్లర్ 90 గ్రహ వ్యవస్థ భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 90ఐ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఒక సారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం తీసుకుంటుంది. దీని ద్రవ్యరాశి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ. గ్రహం మొత్తమ్మీద ఉండే ఉష్ణోగ్రత 436 డిగ్రీల సెల్సియస్. భూమిని పోలిన గ్రహాలను గుర్తించేందుకు నాసా 2009లో కెప్లర్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. నాలుగేళ్లలో 35 వేల గ్రహాల ఉనికిపై కెప్లర్ సంకేతాలిచ్చింది.
కెప్లర్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో గ్రహాల ఉనికిని గుర్తించడంపై కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చారు. బలహీనమైన సంకేతాలున్న 670 గ్రహ వ్యవస్థల సమాచారాన్ని కంప్యూటర్‌కు ఫీడ్ చేశారు. దాన్ని పరిశీలించిన కంప్యూటర్.. కెప్లర్ 90, కెప్లర్ 80 గ్రహ వ్యవస్థల్లో ఒక్కో కొత్త గ్రహం ఉన్నట్లు గుర్తించింది. కెప్లర్ 90లో 7 గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహ వ్యవస్థలో 7 గ్రహాలతో ట్రాపిస్ట్-1 మొదటి స్థానంలో ఉంది.
గ్రావిటీ లెన్సింగ్ అంటే?
ప్రకాశవంతమైన నక్షత్రం ముందు నుంచి గ్రహం వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వెలుగు కొంచెం తగ్గుతుంది. ఈ తగ్గుదలను బట్టి అక్కడ గ్రహం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. దీనినే గ్రావిటీ లెన్సింగ్ అంటారు. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహాలను గుర్తించేందుకు ఈ పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కెప్లర్ 90 ఐ గ్రహం గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నాసా
ఎక్కడ : కెప్లర్ 90 సౌరవ్యవస్థలో
ఎంఐ-8 హెలికాప్టర్లకు వీడ్కోలు
45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ-8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన డిసెంబర్ 17న అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఐ-8 హెలికాప్టర్లకు వీడ్కోలు
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత వాయుసేన
సుఖోయ్‌కు బ్రహ్మోస్ అమర్చే ప్రక్రియ ప్రారంభం
రష్యన్ తయారీ సుఖోయ్-30 యుద్ధవిమానాల్లో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 40 సుఖోయ్ యుద్ధవిమానాలకు ఈ క్షిపణుల్ని అమర్చనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ 2020 నాటికల్లా పూర్తవుతుంది. సుఖోయ్-30 యుద్ధవిమానం ద్వారా తొలిసారి బ్రహ్మోస్‌ను నవంబర్ 22న ప్రయోగించారు. సుఖోయ్‌ల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని అమర్చే ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేపట్టింది. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానాల్లో ఈ మార్పులు చేపడితే.. సముద్రంపై, భూభాగాలపై ఉన్న సుదూర లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం వాయుసేనకు సమకూరుతుంది. భారత్-రష్యా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ధ్వనికంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుఖోయ్‌కు బ్రహ్మోస్ అమర్చే ప్రక్రియ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
క్రీడలు
క్రీడాకారుల్లో ఆల్‌టైమ్ ధనవంతుడు జోర్డాన్
అత్యధిక ధనవంతమైన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రీడాకారుల జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. జోర్డాన్ మొత్తం సంపాదన రూ. 11,881 కోట్లు (1.85 బిలియన్ డాలర్లు). ‘ఫోర్బ్స్’ మేగజైన్ డిసెంబర్14న విడుదల చేసిన Highest-Paid Athletes Of All-Time నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గోల్ఫర్లు టైగర్ వుడ్‌స (రూ.10,918 కోట్లు - 1.7 బిలియన్ డాలర్లు), అర్నాల్డ్ పాల్మర్ (రూ.8991 కోట్లు - 1.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో జాక్ నిక్‌లాస్ రూ.7707 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) ఫార్ములావన్ లెజెండ్ మైకేల్ షుమాకర్ (రూ. 6422 కోట్లు; ఒక బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రీడాకారుల్లో ఆల్‌టైమ్ ధనవంతుడు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : మైకేల్ జోర్డాన్
బీబీసీ అత్యుత్తమ క్రీడాకారుడిగా ఫెడరర్
స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఏటా అందించే అత్యుత్తమ విదేశీ క్రీడాకారుడి పురస్కారానికి ఎంపికయ్యాడు. ఫెడరర్‌కు ఈ పురస్కారం లభించడం ఇది నాలుగోసారి. 2004, 2006, 2007లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.
1960 లో ప్రవేశపెట్టిన ఈ అవార్డులను ఇప్పటివరకు బాక్సింగ్ క్రీడాకారుడు మొహమ్మద్ అలీ (అమెరికా-1973, 1974, 1978), అథ్లెట్ ఉసేన్ బోల్ట్ (జమైకా-2008, 2009, 2012) మూడుసార్లు చొప్పున గెల్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీబీసీ అత్యుత్తమ విదేశీ క్రీడాకారుడి పురస్కారం 2017
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎందుకు : 2017 లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ రన్నరప్‌గా సింధు
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఫైనల్ పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఓడిపోయింది. డిసెంబర్ 17న జరిగిన ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత యామగుచికి 80 వేల డాలర్ల (రూ. 51 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ... 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు; రన్నరప్ సింధుకు 40 వేల డాలర్ల (రూ. 25 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీ... 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : విజేత అకానె యామగుచి(జపాన్), రన్నరప్ పీవీ సింధు
ఎక్కడ : దుబాయ్
శ్రీలంకతో వన్డే సీరీస్ కైవసం చేసుకున్న భారత్
శ్రీలంకతో జరిగిన వన్డే సీరీస్‌ను భారత్ 2 - 1 తేడాతో కైవసం చేసుకుంది. డిసెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన టీమ్ ఇండియా.. సీరీస్‌ను గెలుచుకుంది. కుల్దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ అవార్డులు లభించాయి. కాగా భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం.
కామన్వెల్త్ రెజ్లింగ్‌లో సుశీల్‌కు స్వర్ణం
మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్ ఖుల్లర్ (న్యూజిలాండ్)ను సుశీల్ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 62 కేజీల విభాగం ఫైనల్లో 13-2తో తైలా తుహినే (న్యూజిలాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది.
యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మరో రెండు టెస్టులు ఉండగానే స్మీత్ బృందం 3-0తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 18న ముగిసిన మూడో టెస్టులో స్మిత్ సేన ఇన్నింగ్‌స 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాషెస్ సీరీస్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : సీరీస్‌ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా
టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో బ్రాడ్‌మన్ తర్వాత స్మిత్
టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో దివంగత ఆస్ట్రేలియన్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ స్మీవెన్ స్మిత్ కొనసాగుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌సలో 945 పాయింట్లతో స్మీత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ గ్రేట్ లెన్ హటన్ (945) రికార్డును సమం చేసిన 28 ఏళ్ల స్మిత్... ఆస్ట్రేలియన్ ‘డాన్’కు కేవలం 16 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. సగటుల్లోనూ స్మిత్ (62.32), బ్రాడ్‌మన్ (99.94) తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ నూటికి చేరువగా ఉన్న ఆ దిగ్గజాన్ని అందుకోవడం కష్టమే.
వార్తల్లో వ్యక్తులు
ఐఓఏ కొత్త అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. డిసెంబర్ 14న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 142 ఓట్లు రాగా ప్రత్యర్థి అనిల్ ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి. ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. బాత్రా ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఐఓఏ కార్యదర్శిగా రాజీవ్ మెహతా ఎన్నికవగా, కోశాధికారిగా ఆనందీశ్వర్ పాండే గెలిచారు. నూతన కార్యవర్గం నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం కొత్త అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నరీందర్ బాత్రా
ఎక్కడ : ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో
ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌గా డాక్టర్ హేమలత
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నూతన డెరైక్టర్‌గా సీనియర్ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం డిసెంబర్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసిన హేమలత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలోని ఎన్‌ఐఎన్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా చేరారు. గర్భిణులు, నవజాత శిశువులకు పౌష్టికాహారం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. పరిశోధన రంగంలో ఆమె అందించిన సేవలకు 2016లో ‘ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్’, 2017 లో ‘ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సెన్సైస్’ అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార సంస్థ నూతన డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఆర్.హేమలత
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : పూర్తిస్థాయి డెరైక్టర్‌ను నియమించడంలో భాగంగా
బాలీవుడ్ నటుడు నీరజ్ ఓరా కన్నుమూత
బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు నీరజ్ ఓరా డిసెంబర్ 14న మరణించారు. ఓరాకు 2016, అక్టోబర్‌లో గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సత్య, ఫిర్ హెరా ఫెరి, దౌడ్ వంటి సినిమాలతో ఓరా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీరజ్ ఓరా కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు
రిటైర్‌మెంట్ ప్రకటించిన సోనియా గాంధీ
ఏఐసీసీ అధ్యక్షుడిగా డిసెంబర్ 16న రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ రిటైర్‌మెంట్ ప్రకంటించారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా 19 ఏళ్ల 9 నెలలు అధ్యక్షురాలిగా ఉన్నారు. సోనియా నాయకత్వంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 114 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో 1999-2004 మధ్యలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియా ప్రధాని కావాల్సి ఉండగా ఆమె విదేశీయురాలు కావడంతో ప్రధాని పదవి చేపట్టలేకపోయారు. దీంతో తన అనుచరుడు మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపికచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిటైర్‌మెంట్ ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : సోనియా గాంధీ
ఎందుకు : ఆరోగ్య కారణాలరీత్యా
ఇ-సైకిల్ ప్రచారకర్తగా సల్మాన్‌ఖాన్
ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సైకిల్ తొక్కనున్నాడు. ఢిల్లీ-మీరట్‌ల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్‌పై సల్మాన్ ఇ-సైకిల్ సవారీ చేస్తారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఈ ట్రాక్‌ను నిర్మిస్తోందని, దీనికి అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్ కొనసాగుతారని గడ్కరీ తెలిపారు. నగరంలో చిన్నపాటి దూరాలకు సైకిల్ సవారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సల్మాన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఢిల్లీలో కాలుష్యం స్థాయికి మించి పెరిగిపోవడంతో... డీజిల్, పెట్రోలు వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇ-సైకిల్ ప్రచారకర్త
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : సల్మాన్ ఖాన్
ఎక్కడ : ఢిల్లీ-మీరట్‌ల మధ్య
ఎందుకు : ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు
‘మిస్ ఇండియా-యూఎస్‌ఏ’గా శ్రీసైని
‘మిస్ ఇండియా యూఎస్‌ఏ-2017’ కిరీటం వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీసైని (21) అనే విద్యార్థినిని వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా కనెక్టికట్‌కు చెందిన వైద్య విద్యార్థిని ప్రాచీ సింగ్ (22), రెండో రన్నరప్‌గా నార్త్ కరోలినాకు చెందిన ఫరీనా నిలిచారు. న్యూజెర్సీలోని రాయల్ అల్బర్‌ట్స ప్యాలెస్‌లో డిసెంబర్ 17న మూడు విభాగాల్లో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో 24కు పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది పాల్గొన్నారు. కాగా మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ఫ్లోరిడాకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కవితా మల్హోత్రా పట్టాని ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ టైటిల్‌ను ప్రేరణ, రెండో రన్నరప్ టైటిల్‌ను ఐశ్వర్య సాధించారు. మిస్ టీన్ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన స్వప్న మన్నం(17) గెలుచుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ఇండియా-యూఎస్‌ఏ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : శ్రీసైనీ
ఎక్కడ : న్యూజెర్సీ
జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్‌నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్
అవార్డులు
ఓప్రా విన్‌ఫ్రేకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
అమెరికా టీవీ స్టార్ ఓప్రా విన్‌ఫ్రే 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ‘ది ఓప్రా విన్‌ఫ్రే షో’తో గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్ చానల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డునే సెసిల్ బి డిమిల్లే పురస్కారం అని కూడా అంటారు. వీటిని ఏటా హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్(హెచ్‌ఎఫ్‌పీఏ) ప్రకటిస్తుంది. మీడియా ప్రతినిధులు, నిర్మాతలు, నటీనటులు, సామాజిక కార్యకర్తల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 75వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఓప్రా విన్‌ఫ్రే
కె.విశ్వనాథ్‌కు బాపు జీవిత సాఫల్య పురస్కారం
సినీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌కు బాపు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో అధికారికంగా మూడు రోజులుగా నిర్వహించిన బాపు జయంత్యుత్సవాల్లో ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాపు జీవిత సాఫల్య పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కె.విశ్వనాథ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
కేటీఆర్‌కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’అవార్డుకు ఎంపిక చేసింది. అలాగే పట్టణ మౌళిక వసతుల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో పురస్కారం దక్కింది. కొత్త రాష్ట్రాన్ని దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపారంటూ కేటీఆర్‌ను ఈ సందర్భంగా బిజినెస్ వరల్డ్ ప్రశంసించింది. మంత్రి నిర్వహిస్తున్న బాధ్యతలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్న తీరు, దేశవ్యాప్తంగా ఆయనకు లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇంటింటికీ తాగునీరు సరఫరా కోసం పట్టణాల్లో మిషన్ భగీరథ.. అలాగే హరితహారం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు లాంటి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ పట్టణ మౌలిక సదుపాయాలున్న రాష్ట్రంగా తెలంగాణకు పురస్కారం ప్రకటించామని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేటీఆర్‌కు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : బిజినెస్ వరల్డ్
Comments
Post a Comment