అంతర్జాతీయం
ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డిసెంబర్ 7న ఆమోదించింది. ఇంతకుముందు ఈ బిల్లును పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43-12 మెజారిటీతో ఆమోదించగా.. తాజాగా ప్రతినిధుల సభ (దిగువ సభ) 146-4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేసి 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎక్కడ : ఆస్ట్రేలియా
సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
సౌదీ అరేబియాలో 35 సంవత్సరాల కింద సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ డిసెంబర్11న ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వచ్చి 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయని ఛాందసవాదులు ఆందోళన చేయడంతో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు. ఇటీవల సౌదీలో మహిళలను డ్రైవింగ్, క్రీడామైదానాల్లోకి అనుమతించడం వంటి కీలక సంస్కరణలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌదీ అరేబియాలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్
ఎందుకు : సామాజిక సంస్కరణల్లో భాగంగా
జెరూసలేం పాలస్తీనాదే : ఓఐసీ
ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ డిసెంబర్ 13న నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ డిక్లరేషన్‌లో తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొంటూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరారు.
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను అమెరికా కాకుండా ఐక్యరాజ్య సమితి చేపట్టాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
ఎందుకు : జెరూసలెంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని
జాతీయం
ఆధార్ గడువు మార్చి 31 వరకు పొడిగింపు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ గడువు 2018 మార్చి 31 వరకు పొడిగింపు
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు అనుసంధానం చేసుకోవడానికి
కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపద గుర్తింపు
ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో కుంభమేళాను డిసెంబర్ 7న సాంస్కృతిక వారసత్వ సంపద’గా గుర్తించింది. ఈ మేరకు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్ 4 నుంచి 9 వరకు జరిగిన సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనమే కుంభమేళా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : యునెస్కో
ఎందుకు : ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే సమావేశం అయినందున
హైకోర్టుల్లో 40 లక్షల పెండింగ్ కేసులు
దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో దాదాపు 40.15 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గత పదేళ్లకు సంబంధించినవే 5,97,650 కేసులున్నాయి. ఈ మేరకు 24 హైకోర్టులకు సంబంధించి 2016 చివరి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులపై నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం పెండింగ్ కేసుల్లో చివరి పదేళ్లకు సంబంధించిన కేసుల శాతం 19.45గా ఉండగా ఒక్క బాంబే హైకోర్టులోనే లక్షకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైకోర్టుల్లో 40 లక్షల పెండింగ్ కేసులు
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలు
జనవరి 26న నిర్వహించే భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలను ఆహ్వానించనున్నారు. 60 ఏళ్లుగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలను ఆహ్వానించనున్నారు.
ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలకు ఆహ్వానం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్ష
కూతురు తక్కువ కులస్తుడిని పెళ్లాడటంతో అల్లుడిని చంపిన కేసులో మామతో సహా ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ తమిళనాడులోని తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అలమేలు నటరాజన్ డిసెంబర్ 12న తీర్పు చెప్పారు. తిరుప్పూరు జిల్లాకు చెందిన శంకర్(22) దిండుగల్లు జిల్లాకు చెందిన కౌసల్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కౌసల్య తండ్రి మరో ఆరుగురితో కలిసి 2016 మార్చి 13న శంకర్‌ను హతమార్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్ష
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, తమిళనాడు
ఎందుకు : కూతురు ఇతర సామాజిక వర్గం వారిని పెళ్లి చేసుకున్నందుకు అల్లుణ్ని చంపిన కేసులో
ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 2014 వరకు అధికారంలో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారం కోసం కేంద్రం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి రూ.7.80 కోట్లను కేటాయించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు 12 ప్రత్యేక కోర్టులు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు
ద్వైపాక్షికం
చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37
చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ ర్యాంక్ ఆరు స్థానాలు దిగజారి 37కు చేరింది. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ (ఈఐయూ) 60 దేశాలకు సంబంధించి డిసెంబర్ 7న విడుదల చేసిన ‘చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2017’ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా (2), హాంకాంగ్ (3), మలేషియా(4), ఆస్ట్రేలియాలు (5) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, ఎనర్జీ ఫైనాన్షియల్ సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఎకనామిక్ ఇంటెల్లిజెన్స్ యూనిట్
ఎందుకు : రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో
వాసెనార్ బృందంలో భారత్ కు సభ్యత్వం
ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (Wassenaar) లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది. ఈ మేరకు డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.
Wassenaar Arrangement on Export Controls for Conventional Arms and Dual-Use Goods and Technologies లేదా Wassenaar Arrangement అనేది ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాసెనార్‌లో 42వ సభ్యదేశం చేరిక
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : భారత్
ఎందుకు : రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇతర దేశాలతో అధునాతన సాంకేతికత పంచుకోవడానికి
ఢిల్లీలో ఆర్‌ఐసీ విదేశాంగ మంత్రుల సమావేశం
ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వారి స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. ఈ మేరకు డిసెంబర్ 11న ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్‌ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్ (భారత్), వాంగ్ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : సుష్మాస్వరాజ్, వాంగ్ యీ, సెర్జీ లావ్రోవ్ (రష్యా)
ఎక్కడ : ఢిల్లీ
ప్రాంతీయం
టీయూ 142 మ్యూజియం ప్రారంభం
విశాఖపట్నంలో కురుసుర జలాంతర్గామి ఎదురుగా ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధవిమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 7న ప్రారంభించారు. అనంతరం ఐఎన్‌ఎస్ డేగాలో భారత తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కాల్వరి స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో ఈ-క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, ఇంక్యుబేషన్ సెంటర్ భవనాల శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళలు ఆదర్శనీయమైన సేవలందిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డీఆర్‌డీవో సీనియర్ సైంటిస్ట్ టెస్సీ థామస్‌ను బాలికలు యువతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీయూ 142 మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూలు ఖరారు
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 22న హైదరాబాద్ రానున్నారు. ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 26 వరకు బస చేస్తారు. భారత రాష్ట్రపతి ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రావడం ఆనవాయితీ. ఈ సమయంలోనే దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రపతి నిలయం లోకి సందర్శకులను అనుమతిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన షెడ్యూలు
ఎప్పుడు : డిసెంబర్ 22 నుంచి 26 వరకు
ఎక్కడ : రాష్ట్రపతి నిలయం, బొల్లారం, హైదరాబాద్
ఎందుకు : ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా
విశాఖలో సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు
ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో డిసెంబర్ 8న సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. స్వర్ణోత్సవాలకు త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన భారత నౌకాదళం దేశ రక్షణకే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న సహకారం ప్రముఖమైనదని కొనియాడారు.
భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కల్వరి సబ్‌మెరైన్ సేవలు 1967లో ప్రారంభించారు. ఈ 50 ఏళ్లలో 25 సబ్‌మెరైన్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ నేవీ సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : ఇండియన్ నేవీ
ఎందుకు : సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే సరుకులు అందేలా చేపట్టిన చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న ప్రారంభించారు. ఈ మేరకు విజయవాడ, గుంటూరులో పెలైట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్ మాల్’ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కంటే 4 నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : చంద్రబాబు నాయుడు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : రేషన్ సరుకులను తక్కువ ధరకు అందించడానికి
హోంగార్డుల వేతనం 20 వేలకు పెంపు
తెలంగాణలో హోంగార్డుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. జనహితలో డిసెంబర్ 14న హోంగార్డులతో చర్చలు జరిపిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 18,900 మంది హోంగార్డులు లబ్ధి పొందుతారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 10 నుంచి 25 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హోంగార్డుల వేతనాలు 12 వేల నుంచి 20 వేలకు పెంపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ముఖ్యమంత్రి కేసీఆర్
ఎక్కడ : తెలంగాణ
నిమ్జ్‌లో మౌలిక వసతుల పరికరాల పార్కు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. జహీరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 13న బెంగళూరులో శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్‌స లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్‌స ప్రైవేటు లిమిటెడ్ మరియు ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ పార్కులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారు చేస్తారు. దీని వల్ల వచ్చే పదేళ్లలో 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మౌలిక వసతుల పరికరాల పార్కు ఏర్పాటు ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్‌స లిమిటెడ్ - తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : నిమ్జ్, జహీరాబాద్, తెలంగాణ
ఎందుకు : యంత్ర పరికరాలు తయారీకి
ఆర్థికం
డీబీటీ భారత్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు ‘డీబీటీ భారత్’ పేరుతో కేంద్రం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో డీబీటీ సెల్‌లు ఏర్పాటు చేసింది.
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం వల్ల కేంద్రానికి తొలి ఏడాదిలోనే రూ.29 వేల కోట్లు ఆదా అయింది. దీంతో ఇతర పథకాలైన వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి శిక్షణ, ఉపాధి హామీ నిధులు, అంగన్ వాడీ పథకాల్లో సబ్సిడీని నేరుగా వినియోగదారులకే అందిస్తోంది. డీబీటీతో 2016-17లో రూ.57,029 కోట్లు ఆదా అయినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 395 కేంద్ర పథకాలు అమలవుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీబీటీ భారత్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : లబ్ధిదారుల వివరాల్లో పారదర్శకత కోసం
వృద్ధి రేటును 6.7 శాతానికి కుదించిన ఏడీబీ
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఈ అంచనాను ఇంతకు ముందు 7 శాతంగా పేర్కొన్న ఏడీబీ.. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ తొలి దశ ప్రతికూలాంశాలు, రుతుపవనాలు, వ్యవసాయంపై సంబంధిత ప్రభావం వంటి అంశాలను కారణంగా చూపుతూ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2018-19 వృద్ధి అంచనాలను కూడా 7.4 శాతం నుంచి 7.3 శాతానికి కుదించింది. క్రూడ్ ధరల పెరుగుదల, ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. 2017-18 ద్రవ్యోల్బణం ఇంతకు ముందు ఉన్న 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది.
భారత వృద్ధిరేటుపై వివిధ సంస్థల అంచనాలు
ప్రపంచబ్యాంక్ 2017-18 వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20 నాటికి 7.4 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది.
2017-18కి ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) వృద్ధి అంచనా 6.7 శాతం.
ఫిచ్ రేటింగ్స్ కూడా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018-19కి 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.
మూడీస్ 2017-18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
2017-20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్స్ విశ్లేషించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 6.7 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్
ఎందుకు : డీమోనిటైజేషన్, జీఎస్‌టీ ప్రతికూలాంశాలు, వ్యవసాయంపై రుతుపవనాల ప్రభావం
7.2 బిలియన్ డాలర్లకు క్యాడ్
2017-18 రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 7.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇదే త్రైమాసికం జీడీపీ విలువలో ఇది 1.2 శాతం. గతేడాది ఇదే త్రైమాసికంలో క్యాడ్ విలువ 3.4 బిలియన్లు మాత్రమే. అప్పటి త్రైమాసిక జీడీపీ విలువలో ఇది 0.6 శాతం.
దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం నుంచి దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్యాన్ని తీసేస్తే మిగిలే నికర విలువను కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అంటారు. వీటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) మినహాయిస్తారు. ఒకదేశ ఎగుమతుల విలువ కన్నా- దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడమే (వాణిజ్యలోటు) ఆ దేశ క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణం. 2017-18 మొదటి 6 నెలల కాలంలో భారత్ వాణిజ్యలోటు 49.4 బిలియన్ డాలర్ల నుంచి 74.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7.2 బిలియన్ డాలర్లు పెరిగిన క్యాడ్
ఎప్పుడు : 2017-18 రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)
ఎందుకు : దిగుమతుల విలువ ఎక్కువగా ఉండటం వల్ల
సైన్స్ అండ్ టెక్నాలజీ
రామసేతు మానవ నిర్మాణమే: సైన్స్ చానల్
రామసేతు (Adam's Bridge) అనేది వేల సంవత్సరాల కింద మానవుడు నిర్మించినదేనని అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్‌స సంస్థకు చెందిన సైన్స్ చానల్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని తేల్చింది. రామసేతువు వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమనే వాదన మరోవైపు ఉంది. ఇది తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలోమీటర్ల దూరంపాటు సముద్రంలో ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినది కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు తెలిపారు. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ ఆ చానల్ పేర్కొంది.
రామసేతువు నిర్మాణాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000- క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణించి మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఐసీహెచ్‌ఆర్ చైర్మన్ వై.సుదర్శనరావు వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామసేతు మానవ నిర్మితమే
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్‌స సంస్థకు చెందిన సైన్స్ చానల్
ఎక్కడ : తమిళనాడు - శ్రీలంక ల మధ్య
ఎందుకు : భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా
గూగుల్ సెర్చ్‌లో బాహుబలి-2 టాప్
2017లో ఇంటర్నెట్‌లో అత్యధికులు శోధించిన అంశాల్లో బాహుబలి-2 చిత్రం తొలిస్థానంలో నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండోస్థానం, ‘లైవ్ క్రికెట్ స్కోర్’ అనే పదం మూడోస్థానంలో నిలిచాయి. ఈ మేరకు గూగుల్ డిసెంబర్ 13న ఒక జాబితా విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ సినిమా దంగల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రాలు, చాంపియన్‌స ట్రోఫీ తదితర అంశాలు టాప్-10లో ఉన్నాయి. ఈ ఏడాదికి ‘సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్’గా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్ సెర్చ్‌లో అత్యధిక మంది వెతికిన అంశం
ఎప్పుడు : 2017
ఎవరు : బాహుబలి-2
ఎక్కడ : భారత్‌లో
క్రీడలు
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డో
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును 2017 సంవత్సరానికి క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) గెలుచుకున్నాడు. రొనాల్డో ఈ అవార్డు గెలుచుకోవడం ఇది ఐదోసారి. దీంతో మరో ఆటగాడు లయొనల్ మెస్సీ రికార్డును సమం చేశాడు. ఈ పోటీలో మెస్సీ రెండో స్థానంలో నిలవగా, నెయ్‌మార్‌కు మూడో స్థానం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాలన్ డి ఓర్ పురస్కారం 2017 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : క్రిస్టియానో రొనాల్డో
హాకీ వరల్డ్ లీగ్ టోర్నీలో భారత్‌కు కాంస్యం
ఒరిస్సాలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో డిసెంబర్ 10న జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో గెలిచి మూడోస్థానంలో నిలిచింది.
ఫైనల్లో ఆస్ట్రేలియా 2-1తో రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనాను ఓడించి వరుసగా రెండోసారి హెచ్‌డబ్ల్యూఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాకీ వరల్డ్ లీగ్ టోర్నీలో కాంస్యం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : భారత్
రోహిత్ శర్మ డబుల్ సెంచరీల రికార్డు
భారత్, శ్రీలంకల మధ్య డిసెంబర్ 13న మొహాలిలో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 153 బంతుల్లో 208 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్‌కు ఇది మూడో డబుల్ సెంచరీ. ఆస్ట్రేలియాపై 209 (2013లో బెంగళూరులో), శ్రీలంకపై 264 (2014లో కోల్‌కతాలో) డబుల్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, గప్టిల్ మాత్రమే ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూడు డబుల్ సెంచరీల రికార్డు
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : రోహిత్ శర్మ
ఎక్కడ : మొహాలీ, ఢిల్లీ
ఎందుకు : శ్రీలంపై రెండో వన్డే సందర్భంగా
యూత్ బాక్సర్ ఆఫ్ ఇయర్‌గా సచిన్ సివాచ్
భారత ప్లేయర్, సచిన్ సివాచ్ ఈ ఏడాదికిగాను ఆసియా యూత్ బాక్సింగ్ సమాఖ్య(ఎబీసీ) ఉత్తమ బాక్సర్‌గా ఎంపికయ్యాడు. గతేడాది ప్రపంచ టైటిల్‌ను సాధించిన సచిన్.. ఈ ఏడాది యూత్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతోపాటు ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నాడు.
భారత్‌కు చెందిన లెన్నీ డి గామకు ఆసియా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫిషియల్ అవార్డు వచ్చింది. ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌తోపాటు ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ లెన్నీ సేవలందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూత్ బాక్సర్ ఆఫ్ ఇయర్ 2017
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : సచిన్ సివాచ్
వార్తల్లో వ్యక్తులు
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) నియమితులయ్యారు. రాహుల్ తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి డిసెంబర్ 16న బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు ఉపసంహరించుకోగా రాహుల్ నామినేషన్ మాత్రమే మిగిలింది. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ-గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : రాహుల్ గాంధీ
తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్
తూర్పు నౌకాదళానికి నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్ డిసెంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్‌స స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా బదిలీ అయ్యారు. దీంతో 1978 యూపీఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన ఎంఎస్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. పవార్ ప్రస్తుతం సీబర్డ్ ప్రాజెక్టు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలో ఫ్లాగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పవార్ 1999 కార్గిల్ యుద్ధం సమయంలో వెస్ట్రన్ ఫ్లీట్‌కు ఫ్లీట్ నేవిగేషన్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు పరమ విశిష్ట సేవా పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఎంఎస్ పవార్
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు : ప్రస్తుత చీఫ్ అతుల్ కుమార్ జైన్ బదిలీ అవడంతో
డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ కన్నుమూత
ప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ (70) డిసెంబర్ 10న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జన్మించిన సింగ్ బీహెచ్‌యూలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఇదే యూనివర్సిటీకి 25వ వైస్‌చాన్స్ లర్‌గా పనిచేశారు.
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995-99)కూడా సేవలందించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. ల్యాకోన్‌స, జెనోమ్ ఫౌండేషన్ (పేదప్రజలకు జన్యుపరమైన సమస్యలకు చికిత్సనందించే సంస్థ) వంటి పలు సంస్థలను ఆయన స్థాపించారు.
దేశంలో డీఎన్‌ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్ధారించే పరీక్షలను లాల్జీ సింగ్ అభివృద్ధి చేశారు. 1991లోనే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా డీఎన్‌ఏను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఓ పితృత్వ కేసును నిర్ధారించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్ హత్య కేసుల్లోనూ మృతుల నిర్ధారణకు ఈ టెక్నాలజీనే ఉపయోగించారు.
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని సీసీఎంబీ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల ఆధారంగా అంతరించిపోతున్న జీవజాతుల సంతతిని పెంచేందుకు లేబొరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్‌స)ను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : లాల్జీసింగ్
ఎక్కడ : భారత్‌లో
‘మీ టూ’ ఉచ్చులో ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు తమ వివరాలు బహిర్గతం చేస్తున్న ‘మీ టూ’ హ్యాష్ ట్యాగ్ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుకున్నాడు. డిసెంబర్ 12న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో జెస్సీకా లీడ్‌స, రేఛల్ క్రూక్స్, సమంతా హాల్వే అనే మహిళలతో పాటు 16 మంది ట్రంప్ తమపై లైంగికదాడికి యత్నించాడని ఆరోపించారు. తమ అనుమతి లేకుండానే చుంబించడం, సున్నిత ప్రదేశాలను తాకడం వంటి అవాంఛిత చర్యలకు ట్రంప్ పాల్పడ్డారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మీ టూ’ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : మహిళలను లైంగికంగా వేధించినందుకు
అవార్డులు
ప్రియాంక చోప్రాకు మదర్ థెరిస్సా స్మారక పురస్కారం
తన సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించినందుకు గుర్తింపుగా ప్రియాంక చోప్రా మదర్ థెరిస్సా స్మారక పురస్కారం అందుకుంది. ప్రియాంక.. మదర్ థెరిస్సా స్ఫూర్తిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్‌నివాస్ అనే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇచ్చింది. ఇప్పటికే యూనిసెఫ్‌కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మదర్ థెరిస్సా స్మారక పురస్కారం 2017
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ప్రియాంక చోప్రా
ఎందుకు : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రేమ్‌నివాస్ అనే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇచ్చినందుకు
Comments
Post a Comment