ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు డిసెంబర్ 28న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది.
బిల్లులో ఏముంది..
ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది.
- రాతపూర్వకంగా లేక మొబైల్, ఈ-మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.
- బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.
- మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. - తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3-2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది.
ఇక నుంచి భారత సైన్యంలో ఒంటెలు
చైనా అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఒంటెల సేవలను ఉపయోగించుకోబోతోంది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు ఒంటెలను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల్లో గస్తీ తిరగడంతోపాటు, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర వస్తువులను రవాణా చేసేందుకు వీటిని ఉపయోగించుకోబోతోంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు సుమారు 180 నుంచి 220 కేజీల బరువును మోస్తాయి. ఈ ఒంటెలు రెండు గంటల సమయంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా శిక్షణ ఇస్తారని తెలుస్తోంది.
మన్‌కీబాత్’ ట్విటర్‌లో టాప్
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో మన్‌కీ బాత్’ కార్యక్రమం హ్యాష్‌ట్యాగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి నెటిజన్లు చర్చించారనేది వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోదీ మన్‌కీ బాత్’ కార్యక్రమం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ హ్యాష్‌ట్యాగ్ మన్‌కీ బాత్ అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ముంబై వరదలు, ట్రిపుల్ తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి.
లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
కీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును ప్రభుత్వం డిసెంబర్ 29న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
బిల్లులోని ముఖ్యాంశాలు..
- నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
- ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి.
- వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
- వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
- పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లు
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎందుకు : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటుకు
సత్యేంద్రనాథ్ బోస్ జయంత్యుత్సవాల్లో మోదీ ప్రసంగం
శాస్త్ర సాంకేతికాంశాలను విసృ్తతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్‌సపై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ఈ మేరకు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జనవరి 1న కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్‌స ద్వారా ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు.
ఎలక్టోరల్ బాండ్ల విధి విధానాలు ఖరారు
రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో పారదర్శకత కోసం అమల్లోకి తేనున్న ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాల్ని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 2న ప్రకటించారు. విరాళాలిచ్చే దాతలు ఎలక్టోరల్ బాండ్లను ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఆ బాండ్లను ఈసీకి సమర్పించిన బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము చేసుకోవాలని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలకిచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న ఈ ఎలక్టోరల్ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు ఎంపిక చేసిన ఎస్‌బీఐ శాఖల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలున్న సంవత్సరంలో మాత్రం 30 రోజుల పాటూ బాండ్లను విక్రయిస్తారు. కొనుగోలు అనంతరం 15 రోజుల పాటు ఇవి చెల్లుబాటు అవుతాయి. బాండ్లపై విరాళమిచ్చే దాత పేరు ఉండదని, అయితే వాటిని కొనుగోలు చేసే వ్యక్తి లేక కంపెనీ.. బ్యాంకుకు కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని జైట్లీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఖరారు చేసిందని వెల్లడించారు.
కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీలకే
ప్రామిసరీ నోటును పోలిఉండే ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ ఇవ్వవు. బాండ్లలో పేర్కొన్న మొత్తాన్ని రాజకీయ పార్టీలకు చెల్లించేవరకు వాటిపై పూర్తి హక్కులు దాతకే చెందుతాయి. అయితే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల సొమ్మును చెల్లిస్తారు. అందుకోసం పార్టీలు ఎన్నికల సంఘానికి బ్యాంకు ఖాతాను ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి మొత్తాల్లో బాండ్లను దాతలు కొనుగోలు చేయవచ్చు. భారతీయ పౌరులు, భారత్‌లోని కార్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు అర్హులు. అయితే బాండ్లపై కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఉండదు. 15 రోజుల్లోగా పార్టీలు వాటిని సొమ్ము చేసుకోవాలి.
స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు
దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్‌సభ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టాండింగ్ కమిటీకి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : లోక్‌సభ
అసోం తొలి ఎన్‌ఆర్‌సీ ముసాయిదా విడుదల
జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ-నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్) తొలి ముసాయిదాను అసోం జనవరి 1న ప్రచురించింది. రాష్ర్టంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు.
బ్రహ్మపుత్రలో జలరవాణా ప్రారంభం
కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డిసెం బర్ 29న బ్రహ్మపుత్ర నదిలో పాండు-ధుబ్రి మధ్య కార్గో రవాణాను ప్రారంభించారు. ఎగువ అసోంలోని సాదియా నుంచి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ధుబ్రి మధ్య బ్రహ్మ పుత్ర నదిలో 891 కి.మీ. పొడవున అభివృద్ధి చేసిన జలర వాణా మార్గాన్ని జాతీయ జలమార్గం-2గా ప్రకటించారు. దీన్ని ప్రారంభించడంతో 300 కి.మీ. మేర రహదారి ప్రయా ణం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు ఆదా అవుతాయి.
సయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారి ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారికి ఉద్వాసన
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : అబు అలీ
ఎందుకు : ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకున్నందుకు
సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణం
ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉందని యునిసెఫ్ వెల్లడించింది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది.
- తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు.
- కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు.
- సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు.
- మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
- ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు.
- రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంక్షోభ ప్రాంతాల్లో దారుణంగా చిన్నారుల పరిస్థితి
ఎప్పుడు : 2017లో
ఎవరు : యునిసెఫ్
ఎక్కడ : ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాలో
పాక్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరిక
ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా? అని ట్వీటర్‌లో జనవరి 1న ఘాటుగా విమర్శించారు. సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఉండబోదని హెచ్చరిక
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : ఉగ్రవాదం విషయంలో అవాస్తవాలతో మోసం చేస్తుందని ఆరోపణ
సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్
ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సరం రోజున.. పెట్రోల్ ధరల్ని 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్నును అమల్లోకి తెచ్చిన రెండు దేశాలు
ఎప్పుడు : జనవరి 1 నుంచి
ఎవరు : సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
ఎందుకు : బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలు
న్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.
లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్ వేహ్
లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్ వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్ డిసెంబర్ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.
ఎవరెస్టు ఎత్తు కొలవాలనే భారత్ ప్రతిపాదన తిరస్కరణ నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది.
2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదనలు తిరస్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నేపాల్
‘ఆర్‌కామ్’ను కొనుగోలు చేయనున్న జియో అనిల్ అంబానీకి చెందిన రిలయన్‌స కమ్యూనికేషన్‌స ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్‌స జియో కొనుగోలు చేయనుంది. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్‌స నోడ్‌సను (ఎంసీఎన్) రిలయన్‌స ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్‌స జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్‌స జియో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.24,000 - 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఈ ఆస్తుల విక్రయం ఊరటనిచ్చే విషయం. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్ జియో
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆర్‌కామ్, జియో మధ్య ఒప్పందం
మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్
అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్‌పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే... బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో భారత్‌దే మొదటి స్థానం. ఈ మేరకు డిసెంబర్ 28న ఓ నివేదిక విడుదల చేసిన కేర్ రేటింగ్స్.. భారత బ్యాంకుల మొండి బకాయిల భారం రూ.9.5 లక్షల కోట్లని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలిచింది.
యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు-గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. ఈ నాలుగు దేశాలు జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి.
ఎన్‌పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు- బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : కేర్ రేటింగ్స్
రూ. 2వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్
డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డులు, భీమ్ యాప్ ద్వారా రూ.2,000 దాకా చెల్లింపులపై లావాదేవీల చార్జీలను రద్దు చేసింది. ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా సదరు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీల భారాన్ని ప్రభుత్వమే రెండేళ్ల పాటు భరించనున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయంతో ఖజానాపై రూ. 2,512 కోట్ల మేర ప్రభావం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 2 వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్
ఎప్పుడు : జనవరి 1 నుంచి
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
ఎందుకు : డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు
సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
గగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
డిసెంబర్ 28న నిర్వహించిన మూడోపరీక్షలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు. రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేశారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత సైన్యం
ఒక్క రోజులో 16 న్యూ ఇయర్స్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్ - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఆరుగురు వ్యోమగాములు 2018 కొత్త ఏడాదిని ఒకేరోజులో 16 సార్లు జరుపుకోనున్నారు. భూమికి 402 కి.మీ. ఎత్తులో ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూడటం ద్వారా వారు దీనిని సుసాధ్యం చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) డిసెంబర్ 29న వెల్లడించింది.
కోల్‌కతాలో రెండో టీయూ-142 మ్యూజియం
భారత నావికా దళంలో సుదీర్ఘ సేవలందించిన మరో యుద్ధ విమానం రెండో మ్యూజియంగా మారబోతోంది. ఒక దానిని ఇటీవలే విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేయగా.. ఇప్పుడు రెండో దానిని కోల్‌కతాలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు.
రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది టీయూ-142 యుద్ధ విమానాలు 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చి 29 ఏళ్ల పాటు నిరంతరాయంగా విశేష సేవలందించాయి. వీటిని 2017 మార్చిలో నేవీ విధుల నుంచి తప్పించారు. తమిళనాడులోని అరక్కోణం నేవల్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇవి సముద్ర గగనతలంలో గస్తీ విధులు నిర్వహించాయి. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. వాటి స్థానంలో కొత్తగా పీ8ఐ రకం అత్యాధునిక నిఘా విమా నాలను భారత్ కొనుగోలు చేసింది. నేవీ సేవల నుంచి నిష్ర్కమించిన టీయూ-142 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని ఇటీవల విశాఖలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనిని 2017 డిసెంబర్ 7న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ తొలిరోజైన డిసెంబర్ 28 నుంచి ఇందులో ప్రవేశానికి అనుమతించారు. దేశంలోకెల్లా తొలి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఇదే. ఈ నేపథ్యంలో రెండో టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరింది. ఇందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రెండో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. విశాఖ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియాన్ని విజయవంతంగా పూర్తిచేసి అందరి ప్రశంసలందుకున్న.. ఆంధ్రకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రమణ్‌కుమార్‌నే కోల్‌కతా మ్యూజియానికి కూడా ఇన్‌చార్జిగా పంపనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో టీయూ-142 మ్యూజియం
ఎక్కడ : కోల్‌కతాలో
ఎందుకు : సందర్శకుల కోసం
చెమట చిందించే రోబో ఆవిష్కరణ
పుష్ అప్స్, పుల్ అప్స్ వంటి కఠిన వ్యాయామాలతో పాటు స్వేదాన్ని చిందించే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘కెంగొరో’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. కృత్రిమ స్వేద వ్యవస్థతో పాటు మానవ కండరాలను పోలిన అస్థిపంజరాన్ని రోబోలో అమర్చారు. క్రీడాకారుల కండరాల పనితీరును విశ్లేషించేందుకుగాను దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృత్రిమ స్వేద వ్యవస్థలో తాము కీలకమైన ముందడుగు వేశామని, దీని ద్వారా రోబోలోని అధిక వేడిని తగ్గించవచ్చని వెల్లడించారు. 2001 నుంచి ఈ బృందం రోబోలపై పరిశోధనలు జరుపుతోందని సైన్‌స రోబోటిక్స్ అనే జర్నల్ ప్రచురించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చెమట చిందించే రోబో ‘కెంగొరో’
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : జపాన్ శాస్త్రవేత్తలు
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది. ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా డిసెంబర్ 28న ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయి్యమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి
వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017 విజేత ఆనంద్ మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : విజేత విశ్వనాథన్ ఆనంద్
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
రంజీ ట్రోఫీ - 2017 చాంపియన్ విదర్భ
విదర్భ జట్టు రంజీ ట్రోఫీ సరికొత్త విజేతగా నిలిచింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జనవరి 1న ముగిసిన ఫైనల్లో విదర్భ 9 వికెట్ల తేడాతో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీపై విజయం సాధించి.. ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రంజీ ట్రోఫీ - 2017
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : విజేత విదర్భ
ఎక్కడ : ఇండోర్
వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఆనంద్‌కు కాంస్యం
వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : విశ్వనాథన్ ఆనంద్‌కు కాంస్యం
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
రాజకీయాల్లోకి రజనీకాంత్
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు డిసెంబర్ 31న ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు హీనదశకు చేరుకున్న నేపథ్యంలో ఓ సరైన రాజకీయ వేదిక అవసరం ఉందని.. సొంతగా ఓ పార్టీ పెట్టి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ తెలిపారు.
డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా రాజిందర్ ఖన్నా
నిఘా ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2017 ఆగస్టులో అరవింద్ గుప్తా పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంటోంది. 1978 బ్యాచ్‌కు చెందిన ఖన్నాకు పాకిస్తాన్ వ్యవహారాలు, ఇస్లాం ఉగ్రవాదంపై పూర్తి అవగాహన ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిన ఖన్నా నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ పచ్చజెండా ఊపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా
విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలే
సీనియర్ దౌత్యవేత్త విజయ్ కేశవ్ గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితుల య్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
Comments
Post a Comment