అంతర్జాతీయం
విధ్వంసక ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
అమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు పెడచెవినపెడుతూ ఉత్తర కొరియా మూడోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నవంబర్ 29న ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి.
కొరియా పరీక్షించిన మూడో ఖండాంతర క్షిపణి అయిన హవాసాంగ్-15 భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూడో ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఉత్తర కొరియా
ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాలు కోత
రోబోలు, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే వెల్లడించింది. 46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మెకిన్సే నవంబర్ 29న వెల్లడించింది. దీని వల్ల మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కోనున్నాయి.
ఆటోమేషన్ వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని మెకిన్సే అంచనా వేసింది. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాల కోత
ఎప్పుడు : 2030
ఎవరు : మెకిన్సే
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఉత్తర కొరియాను ధ్వంసం చేస్తాం : అమెరికా
ఉత్తర కొరియా చేస్తున్న వరుస క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే.. ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని ఇతర దేశాలకు పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా నవంబర్ 29న పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ విధంగా స్పందించారు.
ఉత్తర కొరియా తాజాగా పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి, జూలైలో పరీక్షించిన హవాసాంగ్-14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తరకొరియాను పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అమెరికా రాయబారి నిక్కీహేలి
ఎక్కడ : ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి సమావేశంలో
ఎందుకు : ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే
ట్రావెల్ బ్యాన్ కు అమెరికా సుప్రీం కోర్టు ఆమోదం
ఆరు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. దీంతో ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారికి సంబంధించినవారమని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు అమోదం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : అమెరికా సుప్రీం కోర్టు
ఎందుకు : అక్రమ వలసలు నిరోధించి ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు
టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా సెలైన్స్ బ్రేకర్స్’
లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన సెలైన్‌స బ్రేకర్స్’ను టైమ్ మేగజీన్ 2017 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్’ ద్వారా చాలా మంది మహిళలు తమ బాధలను పంచుకున్నారు. వీరినే సెలైన్స్ బ్రేకర్స్’గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.
నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి నరుటో’ ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి కొన్ని సెల్ఫీలు తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2017
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : సెలైన్స్ బ్రేకర్స్ (మీ టూ హ్యాష్‌ట్యాగ్)
ఎందుకు : తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్ ద్వారా వెల్లడించినందుకు
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన ట్రంప్
ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 6న కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమెరికా విదేశాంగ శాఖను ఆదేశించారు. జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం అని వారందరు కలిసే దేశాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు అమెరికా ముందుంటందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : జెరూసలేం మూడు గొప్ప మతాలకు ప్రధాన కేంద్రం అయినందున
జాతీయం
అత్యధిక మలేరియా కేసుల్లో భారత్‌కు మూడోస్థానం
2016 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)-2017 నివేదికను నవంబర్ 29న విడుదల చేసింది. 27 శాతం కేసులతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, 10 శాతంతో కాంగో రెండో స్థానంలో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించగా, 33,997 మరణాలతో కాంగో మొదటి స్థానం, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యధిక మలేరియా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌కు మూడోస్థానం
ఎప్పుడు : 2016
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : మలేరియా నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున
కోపర్డీ’ దోషులకు ఉరిశిక్ష ఖరారు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన కేసులో దోషులకు అహ్మద్‌నగర్ సెషన్‌స కోర్టు నవంబర్ 29న మరణశిక్ష విధించింది. జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు.
మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను 2016, జూలై 13న ఈ ముగ్గురు రేప్‌చేసి చంపేశారు. దీంతో అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి నవంబర్ 18న వీరిని దోషులుగా నిర్ధారించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోపర్డీ దోషులకు మరణశిక్ష ఖరారు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అహ్మద్‌నగర్ సెషన్స్ కోర్టు
ఎక్కడ : కోపర్డీ గ్రామం, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర
ఎందుకు : పదిహేనేళ్ల బాలికను రేప్‌చేసి చంపినందుకు
ఎన్‌సీబీసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
జాతీయ బీసీ కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్‌సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌సీబీసీ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఎన్‌సీబీసీ కి రాజ్యాంగ బద్ధత కల్పించడానికి
నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ : ఎన్‌సీఆర్‌బీ నివేదిక
హత్యలు, మహిళలపై నేరాలు వంటి వాటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా రేప్‌లు (40%) జరిగినట్లు తెలిపింది. 2016లో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 30న విడుదల చేశారు.
నివేదిక ముఖ్యాంశాలు
యూపీలో 2016లో అత్యధికంగా 4889 హత్యలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం హత్యల్లో 16.1 శాతం. బిహార్ 2581 (8.4%) హత్యలతో తరువాతి స్థానంలో ఉంది.
మహిళలపై నేరాలకు సంబంధించి యూపీలో 49,262 (14.5%) కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 32,513 (9.6) కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా రేప్ కేసులు 2015తో పోల్చితే 12.4 శాతం పెరిగాయి. ఈ విషయంలో మధ్యప్రదేశ్(4882), యూపీ (4816), మహారాష్ట్ర(4,189) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఐపీసీ కింద నమోదైన కేసులు యూపీలో 9.5 శాతం ఉన్నాయి. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ (8.7%) ఉన్నాయి.
అపహరణ కేసులు దేశవ్యాప్తంగా 6 శాతం పెరగగా.. పిల్లలపై నేరాలు 13.6 శాతం పెరిగాయి.
షెడ్యూల్డ్ కులాలపై దాడులు 5.5%, షెడ్యూల్డ్ తెగలపై 4.7 శాతం పెరిగాయి.
ఎస్సీలపై దాడులు యూపీలో అత్యధికంగా 25.6% నమోదవగా, తరువాతి స్థానంలో బిహార్ (14%), రాజస్తాన్ (12.6%) ఉన్నాయి.
ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1823(27.8 శాతం) కేసులు నమోదయ్యాయి.
మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల్లో ఢిల్లీలోనే 33 శాతం చోటుచేసుకోగా, ముంబైలో 12.3% కేసులు నమోదయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్
ఎప్పుడు : 2016
ఎవరు : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
ఎక్కడ : దేశవ్యాప్తంగా
‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలు
ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదాను కేంద్రం రూపొందించింది. ఈ మేరకు ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది.
ముస్లిం మహిళల హక్కుల చట్టాన్ని ‘షా బానో చట్టం-1986’గా కూడా పిలుస్తారు. షా బానో కేసు నేపథ్యంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు రక్షణ వర్తించేలా నిబంధనలుండటంతో విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్రం
ఎందుకు : విడాకులకు ముందే ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు
8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదు
దేశవ్యాప్తంగా 2016లో 8132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే. వీటిల్లో 3,579 కేసుల (44 శాతం)తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్ (1,422 కేసులు), గుజరాత్ (548), మహారాష్ట్ర (517), తమిళనాడు (434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదు
ఎప్పుడు : 2016
ఎవరు : నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ద్వైపాక్షికం
‘చాబహర్’ పోర్టును ప్రారంభించిన ఇరాన్
భారత ఆర్థిక సాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలు కలుగుతుంది. ఇరాన్‌లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్‌సలో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. చైనా పెట్టుబడులతో పాకిస్తాన్‌లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా దీనిని భారత్ ఇరాన్‌లో నిర్మించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘చాబహర్’ పోర్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఇరాన్
ఎందుకు : ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు
ప్రాంతీయం
తమిళనాడు, కేరళలో ఓక్కి తుపాను
తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో నవంబర్ 30న ‘ఓక్కి’ తుపాను సంభవించడంతో 8 మంది మరణించారు. తుపాను కారణంగా 65 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో తిరువనంతపురంలో చేపల వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
ఓక్కీ అంటే బెంగాలీ భాషలో కన్ను అని అర్థం. తుపాను పేరును ఖరారుచేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్‌కు రావడంతో ఈ పేరును సూచించింది. సామాన్య ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం (ఇస్కాప్) కలసి 2000 సంవత్సరం నుంచి తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం తీసుకొచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓక్కి తుపాను 2017
ఎప్పుడు : నవంబర్ 30
ఎక్కడ : తమిళనాడు, కేరళలో
తెలంగాణలో మహిళల కోసం వీ హబ్
తెలంగాణ రాష్ర్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ (WE-Hub)’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున రూ.15 కోట్లతో ‘టీ-ఫండ్’ పేరిట కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నవంబర్ 30న జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా పారిశ్రామికవేత్తలకు వీ హబ్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : కేటీఆర్
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడానికి
తెలంగాణ అర్థగణాంక వార్షిక నివేదిక 2017
దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలోనే పట్టణ జనాభా 36 శాతం పెరిగింది. 2001లో రాష్ట్రంలో 98.53 లక్షల పట్టణ జనాభా ఉండగా.. అది 2011లో 1.36 కోట్లకు పెరిగింది. 100 శాతం పట్టణ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నివసిస్తున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. 31 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన అర్థగణాంక వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
అర్థగణాంక వార్షిక నివేదిక ముఖ్యాంశాలు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 31.51 లక్షల మంది వ్యవసాయంలో ఉన్నారు. కూలీ చేస్తూ ఉపాధి పొందుతున్నవారు 59.15 లక్షల మంది.
2015-16లో 21.80 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల పంటలు సాగవగా.. 51.45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాలు 62 శాతం ఉండగా.. 1-2 హెక్టార్ల వరకు ఉన్నవి 23.9 శాతం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కమతాల సగటు విస్తీర్ణం 1.12 హెక్టార్లుగా ఉంది.
రాష్ట్రంలో 1.63 కోట్ల మంది ప్రధాన వృత్తులతో ఉపాధి పొందుతున్నారు.
ఏడాదిలో 183.. అంత కంటే ఎక్కువ రోజులు పని చేసేవారు 1.37 లక్షలు. వీరిలో 22.42 లక్షల మంది ఎస్సీలు, 14.58 లక్షల మంది ఎస్టీలు.
ఓ మోస్తరు పనులతో 26.22 లక్షల మంది.. కుటీర పరిశ్రమలతో 7.77 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
గ్రామాల్లో వ్యవసాయం, వృత్తి పనులు, మోస్తరు పనులతో కాకుండా మిగిలిన రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారు 64.99 లక్షలు. ఏ పనీ చేయని వారు 1.86 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 13.58 శాతం. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 17.70 శాతం.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. ప్రతి 1,000 మంది పురుషులకు 988 మంది మహిళలుండగా.. 11 జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది.
నిర్మల్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,046 మంది మహిళలున్నారు. 1,044 మందితో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. రంగారెడ్డిలో 1,000 మంది పురుషులకు 950 మంది, హైదరాబాద్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారు.
రాష్ట్రంలో ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38.99 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 11.14 శాతం.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54.08 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 15.45 శాతం. ఎస్సీ జనాభాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,008 మంది మహిళలున్నారు.
రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31.77 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. ఎస్టీల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 977 మంది స్త్రీలు ఉన్నారు.
ప్రజల్లో జీవన స్థితిగతులు తెలిపే మానవాభివృద్ధి సూచికలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2015-16 మానవాభివృద్ధి సూచిక రాష్ట్ర సగటు 0.595గా ఉంది.
ఈ సూచికలో హైదరాబాద్ (0.82 శాతం)తో తొలిస్థానంలో నిలవగా.. రంగారెడ్డి (0.71 శాతం), ఖమ్మం (0.62 శాతం) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ అర్థగణాంక వార్షిక నివేదిక
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అర్థగణాంక శాఖ, తెలంగాణ ప్రభుత్వం
ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్
ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జస్టిస్ మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తించి బీసీ (ఎఫ్) కింద ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తెలిపింది. ఈ రిజర్వేషన్లు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల్లో మాత్రమే వర్తింపచేయాలని రాజకీయ పదవులకు వద్దని తెలిపింది.
కమీషన్ నివేదికకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం త్వరలోనే దానిని శాసనసభలో ఆమోదించి కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి పంపనుంది. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించితే కేంద్రం అనుమతి తప్పనిసరి. జస్టిస్ మంజునాథ ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉండగా సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : జస్టిస్ మంజునాథ కమీషన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) గుంటూరు జిల్లా తెనాలిలో డిసెంబర్ 1న ఆవిర్భవించింది. ఈ అసోసియేషన్‌కు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వ్యవస్థాపక చైర్మన్‌గా, సినీనటి కవిత అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరసింహరాజు నియమితులయ్యారు. విభజనానంతరం ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : సనీనటి కవిత (అధ్యక్షురాలు)
ఎందుకు : ఏపీలో సినీ పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి
తెలంగాణలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ క్యాంపస్
ప్రపంచంలోనే మొదటిసారిగా ఐటీ రంగంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఐటీ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు డిసెంబర్ 2న వింద్య ఈ-ఇన్ఫో మీడియా సంస్థతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయడంతోపాటు దివ్యాంగులకు వసతి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ క్యాంపస్
ఎప్పుడు : త్వరలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : దివ్యాంగులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు
ఎరువుల కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఎరువుల కొనుగోలుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎరువుల కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి
ఎప్పుడు : జనవరి 1, 2018
ఎవరు : రైతులు
ఎక్కడ : తెలంగాణలో
ఎందుకు : సబ్సిడీ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి
ఆర్థికం
రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్), వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలానికి వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్రీయ గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) నివేదిక నవంబర్ 30న ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతంతో పోలిస్తే క్యూ2లో ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబర్చింది.
నివేదిక ముఖ్యాంశాలు
క్యూ2లో తయారీ రంగం 7 శాతం వృద్ధి నమోదు చేయగా సేవల రంగం వృద్ధి 7.1 శాతానికి పెరిగింది.
మైనింగ్ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదైంది.
నిర్మాణ రంగం 2.6 శాతం; ఫైనాన్షియల్, బీమా, రియల్ ఎస్టేట్ ఇతర ప్రొఫెషనల్ సేవల రంగానికి సంబంధించి 5.7 శాతం వృద్ధి నమోదైంది.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతరత్రా విభాగాల వృద్ధి రేటు 6 శాతంగా ఉంది.
వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల రంగం క్యూ2లో 1.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
స్థూల విలువ ఆధారిత(గ్రాస్ వేల్యూ యాడెడ్-జీవీఏ) వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్ కాలంలో 6.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 6.8% కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.6 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం
ఎప్పుడు : జులై - సెప్టెంబర్
ఎవరు : కేంద్ర గణాంకాల విభాగం
రూపాయి నోటుకి వందేళ్లు పూర్తి
భారత కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటు నవంబర్ 30 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నోటును 1917 నవంబర్ 30న అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది.
మొదట నోటును ముద్రించినపుడు ఒక్క రూపాయికి 10 గ్రాముల వెండి నాణెం విలువ ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయుధాల విడిభాగాల తయారీకి రూపాయి వెండి నాణేలను కరిగించడంతో రూపాయి నోట్లను ముద్రించాల్సి వచ్చింది.
రూపాయి నోటు - ఆసక్తికర అంశాలు
1917 నవంబర్ 30న అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జి-5 బొమ్మతో విడుదల చేశారు. 1926లో దాన్ని ఉపసంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా కింగ్‌జార్జి-6 బొమ్మతో మళ్లీ ప్రవేశ పెట్టారు.
రూపాయి నోటును ఉస్మానియా, హైదరాబాద్ రాష్ట్రంలో 1919, 1943, 1946లలో విడుదల చేశారు.
1949లో 4 సింహాలు, అశోక చక్రం బొమ్మలతో కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టారు.
అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్‌కే మీనన్ సంతకంతో వెలువడ్డ కొత్త డిజైన్ నోట్లు పాకిస్తాన్‌లోనూ చెలామణి కాగా 1949లో రద్దు చేశారు.
భారత్ గణతంత్ర దేశంగా మారిన తర్వాత విడుదల చేసిన అన్ని ఒక్క రూపాయి నోట్లపై దేశ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాలు ఉండగా, మిగతా అన్ని కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకాలున్నాయి.
రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వం అని ముద్రిస్తుండగా, మిగతా కరెన్సీ నోట్లపై భారతీయ రిజర్వ్‌బ్యాంక్ అని ముద్రించి ఉంటుంది.
1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న రూపాయి నోటు విడుదలైంది.
ఉత్పత్తి ఖర్చు బాగా పెరగడంతో 1995లో రూపాయి డిజైన్‌ను ఉపసంహరించారు. 2016లో పునర్ ముద్రణను ఆర్‌బీఐ మొదలుపెట్టింది.
2017లో కొత్త టెలిస్కోపిక్ సిరీస్‌తో రూపాయి నోటును ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బ్రిటిష్ ప్రభుత్వం
జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణమే లక్ష్యంగా జాతీయ పోషకాహార మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా తక్కువ బరువుతో జన్మించడం, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ఆరోగ్యవంతులను చేయడానికి పలు పథకాలను అమలు చేస్తారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.9,046 కోట్లు కేటాయించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38.4 శాతం మంది (పిల్లలు, మహిళలు) రకరకాల పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. దీనిని 2022 నాటికి 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు, మహిళల సంఖ్యను ఏటా 3 శాతం తగ్గిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : పోషకాహార లోపంతో బాధ, తక్కువ బరువుతో జన్మిస్తున్న పిల్లల సంఖ్యను ఏటా రెండు శాతం తగ్గించేందుకు
భారతవృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించిన ఫిచ్
ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఇందుకు కారణం దేశంలో ఆర్థిక రికవరీ బాగా నెమ్మదిగా ఉందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో (జీఈఓ) పేర్కొంది.
మొదటి త్రైమాసికంలో వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఈ రేటు 6.3 శాతానికి పెరిగింది. ఇటీవల మూడీస్ భారత్ రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్’ స్థాయి నుంచి ‘బీబీబీ 2’ స్థాయికి పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 6.9 నుంచి 6.7 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఫిచ్ రేటింగ్ సంస్థ
ఎందుకు : ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండటం వల్ల
విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు
ఎగుమతుల బలోపేతమే లక్ష్యంగా విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్‌టీపీ) కేంద్ర ప్రభుత్వం మరిన్ని పోత్సాహకాలను జతచేసింది. ఈ మేరకు 2015-20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించిన కేంద్రం డిసెంబర్ 5న ఎఫ్‌టీపీని విడుదల చేసింది.
ఎఫ్‌టీపీ ప్రధానాంశాలు
సరుకుల ఎగుమతి పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాలను రెడీమేడ్ గార్మెంట్స్‌పై 2 శాతం పెంచారు. దీంతో ఎంఈఐఎస్ వార్షిక బడ్జెట్ 34 శాతం పెరిగి రూ.8,450 కోట్లకు చేరింది.
సేవల ఎగుమతుల పథకం (ఎస్‌ఈఐఎస్) కింద ప్రోత్సాహకాలను 2 శాతం పెంచి బడ్జెట్ రూ.1,140 కోట్లు చేశారు.
సెజ్‌లకు సరఫరా చేసే వస్తు, సేవలను జీఎస్టీ కింద సున్నా రేటుగా పరిగణిస్తారు.
డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ చెల్లుబాటు కాలాన్ని 18 నెలల నుంచి 24 నెలలకు పెంచారు.
లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించేందుకు గాను నూతన విభాగం ఏర్పాటు
డేటా ఆధారిత విధాన చర్యలకు డీజీఎఫ్‌టీ పేరుతో అనలైటిక్స్ డివిజన్ ఏర్పాటు
విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు నూతన విధానం.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ఉపాధి కల్పన
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశీ వాణిజ్య విధానంలో మరిన్ని ప్రోత్సాహకాలు
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఎగుమతులను ప్రోత్సహించడానికి
ప్రభుత్వ రుణ భారం 65 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 2.53 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.64,03,138 కోట్లున్న ప్రభుత్వ రుణం, సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి రూ.65,65,652 కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వ రుణ నిర్వహణ విభాగం ప్రకటించింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణ వాటా 93 శాతం. ఇందులో మార్కెట్ బాండ్ల వాటా 82.6 శాతం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 65 లక్షల కోట్లు దాటిన ప్రభుత్వ రుణ భారం
ఎప్పుడు : డిసెంబర్ 5 (2017-18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో)
ఎక్కడ : కేంద్రంలో
ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన డిసెంబర్ 6న జరిగిన ఎంపీసీ సమావేశం రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ తాజా నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ద్రవ్యోల్బణం 4.3-4.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
ముఖ్యాంశాలు
రెపో రేటు 6 శాతం.
రివర్స్ రెపో రేటు 5.75 శాతం.
2017-18 జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ పాలసీ రేట్లు యథాతథం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ
సైన్స్ అండ్ టెక్నాలజీ
బెంగళూరులో అంతరిక్ష మ్యూజియం
దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష విజ్ఞానాన్ని అందించే నూతన మ్యూజియంను నవంబర్ 29న బెంగళూరులో ప్రారంభించారు. ఉపగ్రహ తయారీ మొదలు అది అతరిక్షంలోకి వెళ్లే వరకు ఉండే విశేషాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దీనిని విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)తో కలసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటు చేసింది. ఇందులో రాకెట్ బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లే వరకు జరిగే ప్రతి ఘటననూ సిములేటర్ ద్వారా ప్రత్యక్ష అనుభవంలో చూడొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన అంతరిక్ష మ్యూజియం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఇస్రో, వీఐటీఎం
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : ఉపగ్రహాల విశేషాలను సామాన్యులు తిలకించేందుకు
క్రీడలు
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో అభిషేక్‌కు స్వర్ణం
ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ స్వర్ణం సాధించాడు. నవంబర్ 29న ముగిసిన ఫైనల్లో అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) పై విజేతగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఇది వరకే వీరు మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అభిషేక్ వర్మ
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్
పదో నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన బీసీసీఐ
సచిన్ టెండూల్కర్ ధరించిన పదో నంబర్ జెర్సీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనధికారికంగా వీడ్కోలు చెప్పింది. దీంతో ఇక ఆ నంబర్ ను ఆటగాళ్లెవరూ ధరించరు. 2013లో సచిన్ రిటైరయ్యాక ఆ జెర్సీని ఎవరూ వాడలేదు. 2017లో శార్దుల్ ఠాకూర్ తొలి మ్యాచ్‌లో పదో నంబర్ జెర్సీతో కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వివాదం రేగడంతో ఆటగాళ్లెవరూ ఆ నంబర్ జెర్సీపై ఆసక్తి చూపడం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ నంబర్‌కూ అధికారికంగా టాటా చెప్పే అవకాశం బీసీసీకు లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పదో నంబర్ జెర్సీకి వీడ్కోలు
ఎప్పుడు : నవంబర్ 2017
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : సచిన్ ధరించిన జెర్సీ ఇతర ఆటగాళ్లు ధరించడంతో తలెత్తిన వివాదం వల్ల
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయికి స్వర్ణం
అమెరికాలోని అనహెమ్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ సయిఖోమ్ మీరాబాయి చాను రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. చాను 48 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 85, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలతో మొత్తం 194 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా కరణం మల్లేశ్వరి తర్వాత (22 ఏళ్ల అనంతరం) ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మల్లేశ్వరి 1994, 1995 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచింది.
ఈ ఈవెంట్‌లో 193 కేజీల బరువెత్తిన సుక్చరొన్ తున్యా (థాయ్‌లాండ్) రజతం గెలుపొందగా, సెగురా అనా (182 కేజీలు; ఐర్లాండ్) కాంస్య పతకం దక్కించుకుంది. డోపింగ్‌తో రష్యా, చైనా, కజకిస్తాన్, ఉక్రెయిన్, అజర్‌బైజాన్‌లకు చెందిన లిఫ్టర్లు ఇందులో పాల్గొనే అవకాశం కోల్పోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : సయిఖోమ్ మీరాబాయి చాను
ఎక్కడ : అమెరికా
ఎందుకు : 48 కేజీల విభాగంలో అధిక బరువు ఎత్తినందుకు
మహిళల అండర్-19 విజేత ఆంధ్రా జట్టు
బీసీసీఐ మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. గుంటూర్‌లో నవంబర్ 30న జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై 47 పరుగులతో గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది.
ఈ టోర్నీలో ‘బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ద టోర్నీ’గా ముంబైకి చెందిన జెమీమా (1013 పరుగులు) ఎంపికవగా, ఫాతిమా జఫర్ (26 వికెట్లు) ‘బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెలుచుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బీసీసీఐ మహిళల అండర్-19 విజేత
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ఆంధ్ర జట్టు
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో జ్యోతి సురేఖకు స్వర్ణం
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ స్వర్ణ పతకం గెలుచుకుంది. నవంబర్ 30న జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, పర్వీనా, త్రిషాలతో కూడిన భారత జట్టు 230-227తో కొరియాపై గెలుపొందింది. సురేఖ ఇది వరకే కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్ కాంపౌండ్ ఈవెంట్‌లో రజతాన్ని గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యాన్ని సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : జ్యోతి సురేఖ బృందం
వరుస టెస్టు విజయాలతో భారత్ ప్రపంచ రికార్డు
శ్రీలంకతో డిసెంబర్ 6న ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకోవడం ద్వారా భారత్ 9 వరుస టెస్టు విజయాలతో ప్రపంచ రికార్డును సమం చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల సరసన భారత్ నిలిచింది. ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 2015 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై భారత్ వరుస విజయాలు సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9 వరుస టెస్టు విజయాలతో ప్రపంచ రికార్డు సమం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : భారత్
వార్తల్లో వ్యక్తులు
సీపీసీ సమావేశాలకు ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం
బీజింగ్‌లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సమావేశాలకు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను చైనా ఆహ్వానించింది. ఈ మేరకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ సమావేశాల్లో వారు పొల్గొననున్నారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీపీసీ సమావేశానికి ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం
ఎప్పుడు : నవంబర్ 30 నుంచి డిసెంబర్ 03 వరకు
ఎవరు : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా
ఎక్కడ : బీజింగ్, చైనా
తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్‌స’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో నవంబర్ 29న విడుదలైంది. సానియా కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకంను ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది తెలుగులోకి తర్జుమా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది
జీఈఎస్ సదస్సులో స్టార్టప్‌ల చాంపియన్ అజైతా షా
హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో స్టార్టప్‌ల ‘పిచ్’ కాంపిటీషన్‌లో రాజస్తాన్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్ చాంపియన్)గా నిలిచారు. సదస్సును పురస్కరించుకుని స్టార్టప్ కంపెనీలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్‌స అండ్ టెక్నాలజీ (జిస్ట్)’ఆధ్వర్యంలో పిచ్ కాంపిటీషన్‌ను నిర్వహించారు.
అజైతా షా రాజస్తాన్‌లో ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె కృషి చేస్తుంది.ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్టప్‌ల పిచ్ కాంపిటీషన్ గ్రాండ్ చాంపియన్
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అజైతా షా
ఎక్కడ : జీఈఎస్ సదస్సు, హైదరాబాద్
ఎందుకు : మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషికి
ఐరాస ప్రచారకర్తగా దియామీర్జా
బాలీవుడ్ నటి దియామీర్జా ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్తగా నియమితులయ్యారు. భారత్‌లో పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, అడవుల సంరక్షణ తదితర అంశాలపై పలు కార్యక్రమాల ద్వారా ఆమె అవగాహన కల్పించనున్నారు. కేట్ బ్లాంకెట్, అన్నా హాతావే, ఏంజెలీనా జోలీ తదితర హాలీవుడ్ నటులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్త నియామకం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బాలీవుడ్ నటి దియామీర్జా
ఎక్కడ : భారత్
ఎందుకు : కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి
మాజీ సీజేఐ ఆదర్శ్ సేన్ ఆనంద్ కన్నుమూత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్ (81) గుండె పోటుతో డిసెంబర్ 1న కన్నుమూశారు. 1936లో కశ్మీర్‌లో జన్మించిన ఆనంద్ లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. 1998-2001 కాలంలో సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2003-06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ సీజేఐ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఆదర్శ్ సేన్ ఆనంద్
ఎందుకు : గుండెపోటుతో
ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ డిసెంబర్ 2న నియమితులయ్యారు. 2018 జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్న పరేఖ్ అయిదేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ కొత్త సీఈవో నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సలీల్ ఎస్ పరేఖ్
బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
బాలీవుడ్ నటుడు శశికపూర్(79) డిసెంబర్ 4న ముంబైలో కన్నుమూశారు. ఈయన పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో కన్పించారు. 1961లో ధర్మపుత్ర సినిమాతో హీరోగా ప్రస్థానం ప్రారంభించి 116 చిత్రాల్లో నటించారు. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శశి కపూర్ 2011లో పద్మభూషణ్, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎక్కడ : ముంబై
ఎందుకు : మూత్రపిండాల సమస్యతో
వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా అక్షయ్ కుమార్
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. టీవీల్లో ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి అక్షయ్‌ను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 6న తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర వ్యవసాయ పథకాలకు ప్రచారకర్త నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అక్షయ్ కుమార్
ఎందుకు : టీవీ ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి
అవార్డులు
‘గౌరు’ సినిమాకు బాలల చలన చిత్ర అవార్డులు
చైనాలో జరుగుతున్న 13వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భారతీయ చిత్రం ‘గౌరు’ రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో బాలనటుడిగా ప్రతిభ కనబర్చినందుకుగాను రిత్విక్ సాహోరె ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోగా, నటి, గాయకురాలైన ఇలా అరుణ్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని భారత బాలల చలనచిత్ర సంఘం (సీఎఫ్‌ఎస్‌ఐ) నిర్మించింది. రామ్‌కిషన్ నందరామ్ చోయల్ దర్శకత్వం వహించారు. అనారోగ్యంగా ఉన్న తన బామ్మను కాపాడుకునేందుకు రాజస్తాన్‌కు చెందిన గౌరు అనే పదమూడేళ్ల బాలుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్ర కథ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘గౌరు’ సినిమాకు కు బాలల చలన చిత్ర అవార్డులు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : రిత్విక్ సాహోరె (ఉత్తమ నటుడు), ఇలా అరుణ్ (ఉత్తమ నటి)
ఎక్కడ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం, చైనా
ఈటీ ఏషియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్ 2017
ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక అందించే ఏషియన్ బిజినెస్ లీడర్ అవార్డుకు 2017 సంవత్సరానికి గాను మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ ఎంపికయ్యారు. గోల్డ్, డైమండ్ బిజినెస్ కేటగిరీలో ఈటీ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. రూ.30,000 కోట్ల టర్నోవర్‌తో ప్రపంచంలోనే టాప్-5 బంగారు వ్యాపార సంస్థల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌స సంస్థ ఒకటిగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈటీ ఏషియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్ 2017
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : మలబార్ చైర్మన్ ఎం. పి. అహ్మద్
మహ్మద్ అల్ జౌండెకు బాలల శాంతి బహుమతి
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017 సంవత్సరానికి సిరియాకు చెందిన 16 ఏళ్ల మహ్మద్ అల్ జౌండెకు లభించింది. సిరియాలోని బాలల శరణార్థుల హక్కుల కోసం పోరాడుతున్నందుకుగాను జౌండేను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కిడ్‌సరైట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. నెదర్లాండ్‌సలోని హేగ్ నగరంలో డిసెంబర్ 5న జరిగిన కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేతుల మీదుగా మహ్మద్ ఈ బహుమతిని అందుకున్నాడు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో శరణార్థులుగా మారుతున్న బాలల కోసం మహ్మద్ కుటుంబం శరణార్థుల శిబరంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి 2017
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : మహ్మద్ అల్ జౌండె
ఎందుకు : సిరియాలోని బాలల శరణార్థుల హక్కుల కోసం పోరాడుతున్నందుకు
Comments
Post a Comment