Current Affairs

1.రోబోలు, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే వెల్లడించింది.46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మెకిన్సే నవంబర్ 29న వెల్లడించింది. దీని వల్ల మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కోనున్నాయి. 
ఆటోమేషన్ వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని మెకిన్సే అంచనా వేసింది. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాల కోత
ఎప్పుడు : 2030
ఎవరు : మెకిన్సే
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
2.సచిన్ టెండూల్కర్ ధరించిన పదో నంబర్ జెర్సీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనధికారికంగా వీడ్కోలు చెప్పింది. దీంతో ఇక ఆ నంబర్ ను ఆటగాళ్లెవరూ ధరించరు.2013లో సచిన్ రిటైరయ్యాక ఆ జెర్సీని ఎవరూ వాడలేదు. 2017లో శార్దుల్ ఠాకూర్ తొలి మ్యాచ్‌లో పదో నంబర్ జెర్సీతో కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వివాదం రేగడంతో ఆటగాళ్లెవరూ ఆ నంబర్ జెర్సీపై ఆసక్తి చూపడం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ నంబర్‌కూ అధికారికంగా టాటా చెప్పే అవకాశం బీసీసీకు లేదు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పదో నంబర్ జెర్సీకి వీడ్కోలు
ఎప్పుడు : నవంబర్ 2017
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : సచిన్ ధరించిన జెర్సీ ఇతర ఆటగాళ్లు ధరించడంతో తలెత్తిన వివాదం వల్ల
3.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్‌‌స’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో నవంబర్ 29న విడుదలైంది.సానియా కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకంను ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది తెలుగులోకి తర్జుమా చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది
4.ఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ స్వర్ణం సాధించాడు.నవంబర్ 29న ముగిసిన ఫైనల్లో అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) పై విజేతగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఇది వరకే వీరు మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అభిషేక్ వర్మ
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్
5.దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష విజ్ఞానాన్ని అందించే నూతన మ్యూజియంను నవంబర్ 29న బెంగళూరులో ప్రారంభించారు.ఉపగ్రహ తయారీ మొదలు అది అతరిక్షంలోకి వెళ్లే వరకు ఉండే విశేషాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దీనిని విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)తో కలసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటు చేసింది. ఇందులో రాకెట్ బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లే వరకు జరిగే ప్రతి ఘటననూ సిములేటర్ ద్వారా ప్రత్యక్ష అనుభవంలో చూడొచ్చు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన అంతరిక్ష మ్యూజియం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఇస్రో, వీఐటీఎం
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : ఉపగ్రహాల విశేషాలను సామాన్యులు తిలకించేందుకు
6.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన కేసులో దోషులకు అహ్మద్‌నగర్ సెషన్‌‌స కోర్టు నవంబర్ 29న మరణశిక్ష విధించింది.జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు.
మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను 2016, జూలై 13న ఈ ముగ్గురు రేప్‌చేసి చంపేశారు. దీంతో అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి నవంబర్ 18న వీరిని దోషులుగా నిర్ధారించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోపర్డీ దోషులకు మరణశిక్ష ఖరారు
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అహ్మద్‌నగర్ సెషన్‌‌స కోర్టు
ఎక్కడ : కోపర్డీ గ్రామం, అహ్మద్‌నగర్, మహారాష్ట్ర
ఎందుకు : పదిహేనేళ్ల బాలికను రేప్‌చేసి చంపినందుకు
7.అమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు పెడచెవినపెడుతూ ఉత్తర కొరియా మూడోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నవంబర్ 29న ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి.

కొరియా పరీక్షించిన మూడో ఖండాంతర క్షిపణి అయిన హవాసాంగ్-15 భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది.

క్విక్ రివ్యూ:ఏమిటి : మూడో ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఉత్తర కొరియా
8.బీజింగ్‌లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సమావేశాలకు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను చైనా ఆహ్వానించింది.ఈ మేరకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ సమావేశాల్లో వారు పొల్గొననున్నారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.

క్విక్ రివ్యూ:ఏమిటి : సీపీసీ సమావేశానికి ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం 
ఎప్పుడు : నవంబర్ 30 నుంచి డిసెంబర్ 03 వరకు
ఎవరు : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా
ఎక్కడ : బీజింగ్, చైనా
9.2016 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది.ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)-2017 నివేదికను నవంబర్ 29న విడుదల చేసింది. 27 శాతం కేసులతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, 10 శాతంతో కాంగో రెండో స్థానంలో ఉంది. 

ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించగా, 33,997 మరణాలతో కాంగో మొదటి స్థానం, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. 

క్విక్ రివ్యూ:ఏమిటి : అత్యధిక మలేరియా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌కు మూడోస్థానం
ఎప్పుడు : 2016
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : మలేరియా నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున
10.ఇటీవల హత్యకు గురైన కర్ణాటకకు చెందిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ రచనల సంకలనం ‘కొలిమి రవ్వలు’ పుస్తకాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నవంబర్ 28న ఆవిష్కరించారు.గౌరీ లంకేశ్ ఇంగ్లీషు రచనల సంకలనం తెలుగు అనువాదాన్ని వసంతలక్ష్మి సంపాదకత్వంలో హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ప్రచురించింది. ఈ సందర్భంగా గౌరీ సోదరి కవితా లంకేశ్ మాట్లాడుతూ గౌరీ లంకేశ్ పోరాటాన్నీ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

క్విక్ రివ్యూ:ఏమిటి : గౌరీ లంకేశ్ పుస్తకం కొలిమి రవ్వలు ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ప్రకాశ్ రాజ్

Comments